మిస్ వరల్డ్ పోటీలుగా మారిన బికినీ కాంటెస్ట్- మినిమమ్ ఏజ్ 17- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా? - Miss World Interesting Facts
Miss World Competition Interesting Facts : భారత్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో విజేత ఎవరో తెలియనుంది. మరి ఈ అందాల పోటీల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం! ఇంకెందుకు ఆలస్యం చదివేయండి!
Published : Mar 8, 2024, 4:40 PM IST
Miss World Competition Interesting Facts :ప్రపంచ సుందరి పోటీ- ఇదొక వేడుకలాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ఉద్దేశం. మిస్ వరల్డ్-2024 పోటీలు ప్రస్తుతం భారత్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఈసారి కిరీటాన్ని అందుకునే అందాల భామ ఎవరా? అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం సాయంత్రం విజేత పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ అందాలు పోటీలు ఎప్పుడు మొదలయ్యాయి? తొలిసారి ఎవరు గెలిచారు? భారత్‌కు చెందిన అందాల రాశులు ఎన్నిసార్లు గెలుచుకున్నారు? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- 1951లో బ్రిటన్ ఫెస్టివల్లో భాగంగా బ్రిటిష్ టెలివిజన్ ప్రెజెంటర్ ఎరిక్ మోర్లీ బికినీ కాంటెస్ట్ నిర్వహించారు. ఆ పోటీకి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఆ పోటీకి మిస్ వరల్డ్ అని పేరు పెట్టారు. అయితే బికినీ ధరించి ప్రదర్శనలివ్వడమేంటని చాలామంది విమర్శలు గుప్పించారు.
- ఆ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు నిరాకరించాయి. దీంతో బికినీ స్థానంలో నిర్వాహకులు స్విమ్ సూట్‌ను ప్రవేశ పెట్టారు. తర్వాత మరికొన్ని మార్పులు కూడా చేశారు. మోర్లే మరణానంతరం (2000) ఆయన భార్య జూలియా, నేపాల్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త దీపేంద్ర గురంగ్ ఈ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు.
- 1959 నుంచి ఈ పోటీలను బీబీసీ సంస్థ ప్రసారం చేయడం ప్రారంభించింది. 60, 70ల్లో అత్యధిక మంది వీక్షించిన ప్రోగ్రామ్‌గా రికార్డు నెలకొల్పింది.
- స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్ మిస్ వరల్డ్ కిరీటం(First Miss World Winner) అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
- మిస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన తొలి నల్లజాతి మహిళగా జెన్నీఫర్ హోస్టన్ (గ్రెనడా) నిలిచారు. 1970 మిస్ వరల్డ్‌గా ఆమె కిరీటాన్ని ముద్దాడారు.
- ఈ పోటీల్లో వివాహం కాని మహిళలకు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. సాధారణంగా కనీస వయసు 17, గరిష్ఠ వయసు 27. కొన్ని దేశాల వారికి ఆ ప్రాతిపదిక మారుతుంది. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచే ప్రాతినిధ్యం వహించే వీలుంది. వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు.
- ఈ పోటీల్లో గ్లోబల్ ఫైనల్, ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్(Miss World Competition Rounds) పేరుతో వడబోత జరుగుతుంది. వందలాది మహిళలు పోటీ పడగా సుమారు 20 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు.
- బీచ్ బ్యూటీ, మిస్ టాలెంట్, మిస్ స్పోర్ట్, బ్యూటీ విత్ ఏ పర్పస్ వంటి యాక్టివిటీస్ నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని ఫైనల్ రౌండ్‌కు తీసుకుంటారు. అన్ని రౌండ్లలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. 2003 నుంచి ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి.
- 2005లో మిస్ వరల్డ్ పోటీల్లో కాంటినెంటల్ క్వీన్స్ ఆఫ్ బ్యూటీ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఒక్కో న్యాయ నిర్ణేత తన 40మంది కంటెస్టెంట్లను ఐదుగురు చొప్పున ఎనిమిది బృందాలుగా విభజిస్తారు.
- ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని కాంటినెంటల్ క్వీన్ ఫర్ ది రీజియన్ అంటారు. ఒకవేళ భారతీయ మహిళ గెలిస్తే కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ ఫర్ ఇండియా అని పేర్కొంటారు.
- తొలినాళ్లలో ముత్యాలు పొదిగిన కిరీటాలను మిస్ వరల్డ్ విజేతలకు అందించేవారు. కొన్నేళ్లుగా ముత్యాలు స్థానంలో వజ్రాలు చేర్చారు.
- మిస్ వరల్డ్ పోటీలకు 1996లో భారత్ ఆతిథ్యమిచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ పోటీల్లో వెనెజువెలాకు చెందిన ఇరెన్ స్క్లివా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. ఆ ఏడాది నుంచే ఇంటర్నెట్ కవరేజ్‌ను తీసుకొచ్చారు. మిస్ వరల్డ్ వివరాలు పొందుపరిచిన వెబ్‌సైట్‌ను స్క్లివా లాంచ్ చేశారు.
- మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పోటీలు భారత్ (Miss World 2024 India)లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9న మొదలై, మార్చి 9తో ముగియనున్నాయి. దిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికలుగా మారాయి.
- ఇప్పటి వరకు భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు కిరీటాన్ని అందుకున్నారు. రీటా ఫరియా (1966), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తోపాటు వెనెజువెలా ఉంది.
- ప్రస్తుతం జరుగుతున్న 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో 112 మంది పాల్గొన్నారు. మిస్ ఇండియా వరల్డ్- 2022 సినీ శెట్టి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- మిస్ వరల్డ్ పోటీలు బాహ్య సౌందర్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. అందమొక్కటే ఉంటే ఇక్కడ నెగ్గుకురావడం కష్టం. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. సమయస్ఫూర్తితో మెలగాలి.
- అందుకే ఆ వేదికపై విజయకేతనం ఎగరేసిన వారిని బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని ప్రశంసిస్తుంటారు.