తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​ మాకు ఎప్పటికీ మిత్రదేశమే'- మాట మార్చిన మాల్దీవులు- రుణ విముక్తి కోసమే! - Maldives India Debt - MALDIVES INDIA DEBT

Maldives India Debt : భారత్​తో అంటీముట్టనట్లు ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఒక్కసారిగా మాట తీరును మార్చారు. భారతదేశం తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్రుడే అని అన్నారు. మాల్దీవులకు రుణవిముక్తి చేయాలని కోరారు.

Maldives India Debt
Maldives India Debt

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 9:21 AM IST

Updated : Mar 23, 2024, 10:18 AM IST

Maldives India Debt : భారత సైన్యం మాల్దీవులను విడిచిపెట్టి వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టిన ఆ దేశాధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు ఒక్కసారిగా మాట మార్చారు. భారతదేశం మాల్దీవులకు ఎప్పటికీ సన్నిహిత మిత్రుడిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి రుణవిముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే గత నవంబర్‌లో మహ్మద్​ ముయిజ్జు అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మే 10 నాటికి భారత్‌కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని గడువు విధించారు. దీంతో ముయిజ్జు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.

'సాయం చేయడంలో కీలక పాత్ర'
గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు బకాయిపడింది. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ద్వీప దేశం ప్రాధేయపడుతోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయిజ్జు తొలిసారిగా స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాల్దీవులకు సాయం అందించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని భారత్‌ను అభ్యర్థించారు.

మినహాయింపు కోసం భారత్​తో చర్చలు
'గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్‌ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పెరిగిపోయాయి. తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ ఆ దేశంతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం కలిగించం. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సహకరిస్తాం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీతో దుబాయి వేదికగా జరిగిన కాప్‌ 28 సదస్సు సమయంలోనూ ప్రస్తావించాం.' అని ముయిజ్జు పేర్కొన్నారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం
భారత్‌ గత కొన్నేళ్లుగా మానవతాసాయం కింద మాల్దీవులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తోంది. అక్కడ మన దేశ నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్‌ విమానం ఇప్పటివరకు సేవలందిస్తున్నాయి. దాదాపు 80 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. గత ఐదేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అవసరమైన సుమారు 600 మందిని వారు భారత్‌కు తరలించారు. అయితే మాల్దీవులల్లో ఉన్న వారంతా మే 10లోపు తిరిగి వెళ్లిపోవాలని ఇటీవల ముయిజ్జు డిమాండ్‌ చేశారు. భారత్‌తో సంబంధాలు బలహీనపడుతుంటం వల్ల ముయిజ్జు సర్కార్‌ అత్యవసర వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముయిజ్జు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అరుణాచల్ భారత్​ భూభాగమే- చైనా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం : అమెరికా - US On China

పుతిన్​, జెలెన్‌స్కీకు మోదీ ఫోన్​ కాల్- ఎన్నికల తర్వాత రష్యా, ఉక్రెయిన్​కు ప్రధాని!

Last Updated : Mar 23, 2024, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details