Landslide Accident In Congo :భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడిల దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 60మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నైరుతి కాంగోలోని ఇడియోఫా పట్టణంలో ఉన్న ఓడరేవు సమీపంలో శనివారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఏడుగురిని ప్రాణాలతో కాపాడగలిగారు. అయితే గల్లంతైనవారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
'ప్రమాదంలో గల్లంతైన వారిని కనుగొనేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. సహాయక చర్యల్లో ఏడుగురిని ప్రాణాలతో రక్షించగలిగాం. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తరలించాం. ఇంకా 60మంది ఆచూకీ తెలియాల్సి ఉంది' అని ప్రావిన్షియల్ తాత్కాలిక గవర్నర్ ఫెలిసియన్ కివే తెలిపారు.
'ఓడరేవు సమీపంలో ఒక పెద్దకొండ ఉంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఇక ఘటన జరిగిన ప్రాంతంలో ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది. మత్స్యకారులు చేపలు, ఇతర నిత్యవసరాలు అమ్ముకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. అయితే మార్కెట్కు అధిక సంఖ్యలో ప్రజలు రావడం వల్ల ఎంతమంది గల్లంతయ్యారో అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేము' అని స్థానిక అధికారి ధేధే ముపాసా చెప్పారు.