Kamala Harris President Nominee: అమెరికా డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కావాల్సిన మద్దతు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోటీదారుల్లో ముందజలో ఉన్నా హారిస్‌కు 2,579మంది మద్దతుగా నిలిచినట్లు ఓ వార్త సంస్థ సర్వేలో తెలిపింది. 4800మంది ప్రతినిధులున్న డెమొక్రటిక్ పార్టీలో అభ్యర్థిగా నిలబడాలంటే 1,976 మంది మద్దుతు ఉంటే సరిపోతుంది. మరోవైపు ఇప్పటికే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కమలా హారిస్‌కు మద్దతు పలికారు.దీంతో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా కమలా హారిస్ నిలవనున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఎన్నికల రేసు నుంచి వైదొలగుతూ కమలా హారిస్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత విల్మింగ్టన్లో బైడెన్ ప్రచారం బృందంతో కమలా హారిస్ భేటీ అయ్యారు. తనకు మద్దతుగా నిలవాలని కోరుతూ, అభ్యర్థి మాత్రమే మారుతున్నారని, తమ లక్ష్యం మాత్రం ఒకటేనని అన్నారు. పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో గెలుద్దామని కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారని ఆయపై విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, గృహ వసతి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఎవరూ పేదరికంలో మగ్గిపోవద్దని ఆకాంక్షించారు.
'హారిస్‌కు మద్దతుగా నిలవాలి'
మరోవైపు కమలా హారిస్‌కు మద్దతుగా నిలవాలని బైడెన్ తన ప్రచార బృందానికి పిలుపునిచ్చారు. అలాగే తన కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయం బాధించినప్పటికీ, అదే సరైన చర్య అని చెప్పుకొచ్చారు. తన కోసం ఎన్నో త్యాగాలు చేసి, పనిచేసిన వారంతా అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కొవిడ్ నుంచి కోలుకొని త్వరలోనే అందరినీ కలుస్తానని, కమలతో కలిసి ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ట్రంప్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయన్నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు బైడెన్.