Israel Iran Conflict :హమాస్, హెజ్‌బొల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఆయా ప్రాంతాలపై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ చర్యతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. జులైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న హమాస్ నేత ఇస్మాయెల్ హనియే బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ ఉండగా ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది.
తమ అతిథిగా ఉన్న హనియే హత్యకు ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. తాజాగా ఇరాన్‌కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమార్చింది. ఫలితంగా ఇరాన్ ఆగ్రహం తారస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం యెమెన్‌లోని హూతీల స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడిచేసింది. హమాస్, హెజ్‌బొల్లా, హూతీలు ఇరాన్‌కు అనుకూలవర్గాలు కాగా వారికి ఇరాన్ శిక్షణ ఇస్తోంది. వీటిపై ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది.
అమెరికా సాయంతో అడ్డుకున్న ఇజ్రాయెల్
2024 ఏప్రిల్‌లో సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సైనికాధికారులు చనిపోగా అందుకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. అయితే వీటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది. తాజాగా తమ అనుకూల దళాల నేతలను చంపడంపై గుర్రుగా ఉన్న ఇరాన్ మరోసారి దాడి చేసింది. గతంలో ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణుకేంద్రాల సమీప ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. తాజాగా ఇరాన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అణుస్థావరాల ధ్వంసమే ప్రధాన లక్ష్యం!
తాజా దాడులను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్లలో అణుస్థావరాల ధ్వంసం ప్రధానంగా కనిపిస్తోంది. టెహ్రాన్‌కు పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్రబిందువు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇజ్రాయెల్‌కు అవకాశం లభించినట్లైంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్ ఇదే విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.