Israel Air Strike On Gaza : గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగుతోంది. గురువారం నెతన్యాహు సైన్యం చేసిన చేసిన దాడుల్లో 50మందికి పైగా గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అనేక మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఖతార్ ప్రతినిధులతో కాల్పుల విరమణ చర్చలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించిన కొద్ది సేపటికే ఇజ్రాయెల్ దాడులు జరగడం గమనార్హం.
ఇజ్రాయెల్ స్వయంగా మానవతా జోన్‌గా ప్రకటించిన మువాసీతో పాటు డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ వంటి ప్రాంతాలపై కూడా వైమానిక దాడులను నిర్వహించింది. యుద్ధం వల్ల ఇతర ప్రాంతాల నుంచి బతుకుజీవుడా అంటూ వచ్చిన వేలాది మంది శరణార్థులకు మువాసి ఆశ్రయం కల్పిస్తోంది. సరైన సదుపాయాలు లేక, తీవ్రమైన చలికి తట్టుకోలేక అక్కడ రోజూ చిన్నారులు, రోగులు అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ముగ్గురు పిల్లలు, ఇద్దరు హమాస్ పోలీసులతో సహా 10 మంది మరణించారు. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బలహ్లో ఎనిమిది మంది, ఖాన్ యూనిస్‌లో ఐదురుగు పోలీసులు మృతి చెందారు. అయితే హమాస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
సిరియాపై రహస్య ఆపరేషన్ - వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
మరోవైపు సిరియాలో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన భారీ రహస్య సైనిక ఆపరేషన్ తాలూకు వీడియోను ఐడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఇరాన్ నిధుల సమకూరుస్తున్న భారీ భూగర్భ క్షిపణ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. సిరియాలో అసద్ పాలన పతనానికి ముందే అంటే సెప్టెంబర్ 8న "ఆపరేషన్ మెనీ వేయ్స్" పేరుతో ఇజ్రాయెల్ సైన్యం ఆ రహస్య మిషన్ నిర్వహించింది. అందులో సుశిక్షితులైన 120 మంది అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండోలు, 21 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. ఆ క్షిపణి తయారీ కేంద్రం పేరు డీప్ లేయర్‌గా అసద్ ప్రభుత్వం పిలుస్తుందని తెలిసింది.
అసద్ వాయుసేనకు గట్టిపట్టున్న పశ్చిమ సిరియాలోని మస్యాఫ్ ప్రాంతంలో గుర్రపు డెక్క ఆకారంలో 3 ప్రవేశ మార్గాలతో ఆ భూగర్భ మిస్సైల్ యూనిట్ ఉంది. అందులో రాకెట్ ఇంధన మిక్సర్లు, క్షిపణి విడిభాగ తయారీ కేంద్రాలు, పెయింట్ గదులు, పదహారు ఉత్పత్తి గదులు అందులో ఉన్నాయి. 300 కిలోమీటర్ల రేంజ్ కల్గిన మిస్సైల్స్‌ను సంవత్సరానికి 300 వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆ కేంద్రం నిర్మితమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆ మిస్సైల్స్‌ను హెజ్బొల్లా, అసద్ సైన్యానికి అందించాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రహస్య ఆపరేషన్‌లో ఒక్క ఇజ్రాయెల్ సైనికుడికి కూడా గాయం కాలేదని సైన్యం తాజాగా ప్రకటించింది.