Israel Gaza War Updates :పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. 'ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు సహా 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్‌లోని ఇద్దరు మహిళలు కూడా మరణించారు. వాస్తవానికి గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ శరణార్థి శిబిరంగా మార్చరు. కానీ ఈ పాఠశాలపైనే ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది' అని స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో చనిపోయినవారి మృతదేహాలను నుసైరత్‌లోని అల్-అవ్దా ఆసుపత్రికి, డీర్ అల్ బలాహ్లోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించామని సదరు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సెంట్రల్ గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి - చిన్నారులు సహా 20 మంది మృతి
ఇజ్రాయెల్‌పై మిలటరీ బేస్‌పై హెజ్బొల్లా డ్రోన్ దాడి - నలుగురు సైనికులు మృతి
Published : Oct 14, 2024, 7:44 AM IST
|Updated : Oct 14, 2024, 9:13 AM IST
ఇజ్రాయెల్ ఆర్మీ బేస్‌పై హెజ్బొల్లా డ్రోన్ దాడి
ఓవైపు ఇజ్రాయెల్ సెంట్రల్ గాజాపై వైమానిక దాడి చేయగా, మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌ను టార్గెట్ చేసుకుని హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇజ్రాయెల్‌కు అమెరికా 'థాడ్'
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన 'థాడ్'ను తమ మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాలని నిర్ణయించింది. థాడ్ వ్యవస్థను ఆపరేట్ చేయడానికి అమెరికా తన సైనికులను కూడా ఇజ్రాయెల్‌కు తరలించనుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు థాడ్ సాయపడుతుందని పెంటగాన్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఇజ్రాయెల్‌లో ఈ థాడ్ వ్యవస్థను మోహరించేందుకు రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని తెలిపింది. ఈ అమెరికా నిర్ణయంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే, అది ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని హెచ్చరించింది.