Israel Prepares For Iran Attack :పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. అందులో భాగంగా పశ్చిమాసియా ప్రాంతంలో అదనపు బలగాలను మోహరిస్తున్నామని వెల్లడించింది.
హమాస్, హెజ్బొల్లా గ్రూపులకు అండగా ఇరాన్
ఇటీవలే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యారు. మరోవైపు, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మరణించారు. ఈ రెండు పరిణామాల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. పైగా ఈ హమాస్, హెజ్బొల్లా గ్రూపులకు ఇరాన్ మద్దతుగా ఉంది. ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో వేడెక్కిన ఈ ప్రాంతంలో తాజా పరిణామాలతో మరింత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాలు పశ్చిమాసియా దేశాల్లో నెలకొంది.
రంగంలోకి అమెరికా- పరిస్థితులపై జో బైడెన్ సమీక్ష
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరా తీశారు. తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు బైడెన్ సోమవారం జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. జోర్డాన్ రాజు అబ్దుల్లాతోనూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చించనున్నట్లు వెల్లడించింది.