తెలంగాణ

telangana

ETV Bharat / international

నెతన్యాహుపై ఇంటర్నేషనల్ కోర్ట్ వారెంట్‌- ఇజ్రాయెల్ బాస్ అరెస్ట్ అవుతారా? - ICC WARRANT NETANYAHU

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 8:34 PM IST

ICC Warrant Netanyahu : ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు- ICC అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయనతోపాటు రక్షణ శాఖ మాజీ మంత్రి యోఆవ్‌ గల్లాంట్‌పైనా వారెంట్ జారీ అయింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక చర్యల ఆరోపణలపై ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

ప్రధాని నెతన్యాహుతోపాటు మాజీ మంత్రి గల్లాంట్‌ గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అక్కడి పౌరులకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాపై ఆంక్షలు విధించారని పేర్కొంది. తద్వారా మానవ సంక్షోభం తీవ్రమవ్వడం వల్ల మరణాలకు దారి తీసిందని తెలిపింది. ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారారని, అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తగినన్ని ఆధారాలు గుర్తించామని ఐసీసీ తెలిపింది.

ఖండించిన నెతన్యాహు
అయితే తనపై ఐసీసీ అరెస్టు వారెంటు జారీ చేయడాన్ని నెతన్యాహు ఖండించారు. అవి అసంబద్ధమైన, తప్పుడు చర్యలని, వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తోంది తప్ప మరేమీ లేదన్నారు.

44 వేలు దాటిన మృతుల సంఖ్య
మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో గాజా స్ట్రిప్‌లో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 44 వేలు దాటినట్లు గాజా ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. లక్షా 4 వేల మంది గాయపడినట్లు తెలిపింది. మృతి చెందిన వారిలో సగం మందికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు చెప్పింది. అయితే సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో ఉన్న శిథిలాల కింద వేలాది మృతదేహాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. వాటితో కలుపుకుంటే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. అటు ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు 17 వేల మంది హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు వెల్లడించింది.

గతేడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడి చేయగా దానికి ప్రతీకారంగా టెల్‌ అవీవ్‌ భీకర దాడులు చేస్తోంది. దాడుల కారణంగా గాజా ప్రజల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఎంతోమంది నిరాశ్రయులుగా మారారు. మానవతా సాయం కోసం గాజాకు పంపిన ఆహార సామగ్రి ఇటీవల లూటీకి గురైంది. మొత్తం 109 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు తరలిస్తుండగా డ్రైవర్లపై తుపాకీ ఎక్కుపెట్టి 97 ట్రక్కుల్లోని సరకును కాజేశారని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ (UNRWA) ఆరోపించింది. ఈ దాడిలో సహాయ సిబ్బందికి గాయాలయ్యాయని, ట్రక్కులు దెబ్బతిన్నాయని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details