Israel Ground Invasion Of Lebanon :లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై భారీ ఎత్తున వైమానిక దాడులను చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను సైనిక వాహనాలను మోహరించింది. ఉత్తర ప్రాంతంలో లెబనాన్‌తో సరిహద్దును ఇజ్రాయెల్ కలిగి ఉంది. రిజర్వ్ బలగాలు కూడా రంగంలోకి దిగాలని ఇజ్రాయెల్ కమాండర్లు ఆదేశాలు జారీ చేశారు.
యుద్ధ మారణహోమం- వారంలో 700మంది బలి
గాజాపై కూడా తొలుత ఇలానే వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ ఆ తర్వాత భూతల దాడులు ఆరంభించింది. గాజాపట్టీలోని హమాస్ సొరంగ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసింది. ఇప్పుడు లెబనాన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులు మోహరించింది. మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్ర సంస్థ ఇంకా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. హెజ్‌బొల్లా దాడిలో ఇజ్రాయెల్‌లో ఒకరికి గాయాలయ్యాయి. లెబనాన్ నుంచి వచ్చిన 4 డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ వారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.