Israel Gaza War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మేరకు పాలస్తీనియన్లను గాజా నుంచి వేరే ప్రాంతాలకు పంపడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈజిప్ట్ తెరవెనుక దౌత్యపరమైన దాడిని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
సుమారు 50 ఏళ్ల పాటు ఇజ్రాయెల్‌తో ఉన్న తన శాంతి ఒప్పందం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించిందని సమాచారం. పాలస్తీనియన్లను వేరే ప్రాంతాలకు తరలించడం వల్ల మిడిల్ ఈస్ట్ అస్థిరమవుతుందని ఈజిప్ట్ పేర్కొన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. పాలస్తీనియన్ల తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని అమెరికా, ఇజ్రాయెల్ సహా పశ్చిమ ఐరోపా మిత్ర దేశాలకు ఈ మేరకు ఓ సందేశాన్ని ఈజిప్ట్ పంపినట్టు తెలిపారు.
గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించారు. గురువారం తమ సామాజిక మాధ్యమం ట్రూత్‌లోనూ ఇదే తరహాలో ట్రంప్ పోస్ట్ చేశారు. యుద్ధం తర్వాత గాజాను ఇజ్రాయెల్ తమకు అప్పగిస్తే తిరిగి పునర్మిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం సైన్యాన్ని వినియోగించాల్సిన పని లేదని చెప్పారు.