Iran President Helicopter : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణానికి కాలం చెల్లిన హెలికాఫ్టర్ కారణమని తెలుస్తోంది. ఇరాన్ విప్లవానికి ముందు కొన్న బెల్ 212 హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ రైసీ మరణించారు. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారులు చెప్తున్నా, కాలం చెల్లిన హెలికాప్టర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వార్తలు వస్తున్నాయి.
వాటిని మార్చకపోవడమే కారణమా!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన బెల్ 212 హెలికాప్టర్‌ను 1960లో తయారు చేసినట్లు తెలుస్తోంది. దీనిని 1979లో అమెరికా నుంచి ఇరాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విక్రయం తర్వాత అమెరికా ఇరాన్‌కు విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ విప్లవోద్యమం కంటే ముందే హెలికాప్టర్‌ను అమెరికా వద్ద ఇరాన్ కొనుగోలు చేసింది. 1960 దశకం నుంచి ఆపరేటింగ్‌లో ఉన్న ఈ హెలికాప్టర్‌కు ప్రస్తుతం విడి భాగాలు దొరకడం లేదు. ఒకవేళ విడిభాగాలు దొరికినా అంతర్జాతీయ ఆంక్షల వల్ల వాటి విడిభాగాలను ఇరాన్ దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. విడి భాగాలు మార్చకపోవడం కూడా ప్రమాదానికి కారణమైన ఉండొచ్చని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఈ హెలికాప్టర్‌ను అమెరికాకు చెందిన బెల్ టెక్స్‌ట్రాన్ కంపెనీ తయారు చేసింది. ఇది టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ కేంద్రంగా పనిచేస్తోంది.
గతంలోనూ ప్రమాదాలు
బెల్-212 హెలికాఫ్టర్‌లో గరిష్ఠంగా 15 మంది ప్రయాణించవచ్చు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు. దీన్ని బెల్ 205కు కొనసాగింపుగా 1960లో ప్రవేశపెట్టారు. కంపెనీ తయారు చేసే కీలక మోడళ్లలో ఇదొకటి. పరిశ్రమలో అత్యంత సమర్థమైనదిగా వర్క్ హార్స్‌గా దీనికి పేరొంది. ఈ హెలికాప్టర్‌లకు గతంలోనూ ఘోర ప్రమాదాలు జరిగాయి. 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్‌కు చెందిన బెల్-212 లూసియానా తీరంలో కుప్పకూలింది. దీంట్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సాధారణ ఆఫ్‌షోర్ రవాణా కార్యకలాపాలు చేపడుతుండగా మెకానికల్ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది. 2009లో కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ కోల్పోయిన కారణంగా దుర్ఘటన సంభవించినట్లు తేల్చారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా ఇది నిలిచింది.