Iran Israel War: పస్చిమాశియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్ 'ఐరన్ షీల్డ్' చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందని, ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ జరగలేదని తెలిపారు.
ప్రతిదాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు
ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని టెల్ అవీవ్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ విషయం తేలేవరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్‌ను నిర్దేశించలేమని నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది. అయితే తమపై ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.
ఇరాన్ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్‌కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్ బహిరంగంగానే అంగీకరించింది. శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్ల దాడిలో కొన్ని ఇరాక్ గగనతలంపై నుంచి వెళితే, మరికొన్ని జోర్డాన్, సౌదీ గగనతలాల మీదుగా దూసుకెళ్లాయి. తమ గగనతలంపైకి వచ్చిన వాటిని తాము నేలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది.