Iran Attacks Israel : సిరియాలో ఉన్న తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వంద కన్నా ఎక్కువ డ్రోన్లు, మిస్సైళ్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఇరాక్ గగనతలం మీద నుంచి ఇజ్రాయెల్‌వైపు దూసుకెళ్లాయి. వాటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక దళాలు మధ్యలోనే కూల్చివేయగా మరికొన్నింటిని సిరియా, జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్‌పై విరుచుకుపడ్డ కొన్నిటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఆ క్రమంలో జెరూసలెం నగరంలోని అలారంలు మార్మోగాయి. కొన్నిలక్ష్యాల్ని ఇజ్రాయెల్ యాంటీ మిస్సైళ్ వ్యవస్థ నిరోధించిన సమయంలో భారీ శబ్ధాలు వినిపించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జోర్డాన్, లెబనాన్, ఇరాక్ గగనతలాలను మూసివేశాయి. పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా బృందంతో వైట్‌హౌజ్‌లో సమావేశమై సమీక్ష నిర్వహించారు.
ఆర్టికల్ ప్రకారమే దాడి
ఇరాన్ దాడిని ఐరోపా సమాఖ్య, బ్రిటన్, ఫ్రాన్స్, మెక్సికో, చెకియా, డెన్మార్క్ నెదర్లాండ్స్ ఖండించాయి. ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఈ విషయం ఇప్పటితో ముగిసిపోయినట్లు భావిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు.
ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నాం
ఇజ్రాయెల్‌కు తాము పూర్తిగా అండగా ఉంటామని అమెరికా శ్వేతసౌధం ప్రకటించింది. అన్నిరకాలుగా టెల్ అవీవ్‌కు సాయం చేస్తామని ఆ దేశ భద్రతకు తాము హామీ అని బైడెన్ తెలిపారు. 'ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు సంబంధించిన అప్డేట్ కోసం ఇప్పుడే నేను నా జాతీయ భద్రతా బృందాన్ని కలిశాను. ఇరాన్, దాని మిత్రపక్షాల నుంచి బెదిరింపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం' అని తాజాగా బైడెన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఐరాసకు ఇజ్రాయెల్
మరోవైపు ఇరాన్ డ్రోన్ల దాడి కారణంగా దేశం గగనతలాన్ని మూసివేసిన్నట్లు ఇజ్రాయెల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇరాన్ దాడిపై చర్యలు తీసుకోవలంటూ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితికి అత్యవసర లేఖను పంపిన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. 'ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని నేను భద్రతా మండలి అధ్యక్షుడికి ఒక లేఖను పంపాను. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న దాడి ఖండించాలని డిమాండ్ చేశాను. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఇరాన్‌కు వ్యతిరేకంగా అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను' అని లేఖలో పేర్కొన్నారు. ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్వీట్ చేశారు. తక్షణమే ఈ దాడిని విరమించుకోవాలని పిలుపునిస్తున్నాని, ప్రపంచం మరొక యుద్దాన్ని భరించలేదు అని పేర్కొన్నారు.