Indus River Waters Agreement :సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాకిస్థాన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం, పెరుగుతున్న ఉగ్రవాదం వంటి కారణాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
కారణం ఇదే!
భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం- ఐడబ్ల్యూటీ (IWT)ని సవరించుకుందామంటూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న ప్రాథమిక, ఊహించలేని మార్పులు కారణంగా ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని భారత్ వెల్లడించింది. ఐడబ్ల్యూటీలోని ఆర్టికల్ 12 అధికరణం 3 ప్రకారం, ఆగస్టు 30న పాక్‌కు అధికారిక నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, భారతదేశ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి కారణాల కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని వెల్లడించాయి. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాద సమస్యలు కూడా నోటీసు జారీ చేయడానికి కారణమని తెలిపాయి. కిషన్‌గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత ఆరేళ్లుగా దాయాది దేశం చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.