Russia Ukraine peace talks : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు చైనా, భారత్, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్ అమలు చేయడంలేదని ఆరోపించారు. ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది.
శాంతి చర్చలకు రష్యా సిద్ధం
వ్లాదివాస్తోక్‌లో జరుగుతున్న ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా పుతిన్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై స్పందించారు. తామ ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. తాము ఎన్నడూ చర్చలను తిరస్కరించలేదని పేర్కొన్నారు. అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా వీటిని చేపట్టలేమని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో చర్చలు జరిపిన రెండు వారాల వ్యవధిలోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"మేము మా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలను గౌరవిస్తాం. చైనా, భారత్, బ్రెజిల్ వంటి మా మిత్రదేశాలు ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమస్యపై రష్యా మిత్రదేశాలతో నేను నిరంతరం టచ్‌లో ఉంటాను. ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకం చేసింది. అంటే ఆ షరతులపై ఉక్రెయిన్ సంతృప్తిగా ఉన్నట్లే లెక్క. అమెరికా, ఐరోపాల ఒత్తిడి కారణంగానే ఇది అమల్లోకి రాలేదు. రష్యాను వ్యూహత్మకంగా ఓడించాలని కొన్ని ఐరోపా దేశాలు కలగంటున్నాయి." అని పుతిన్ వ్యాఖ్యానించారు.