MEA Asks Russia To Release Indians :రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న కేరళ వాసి మృతి చెందడాన్ని భారత విదేశాంగశాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. 'ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయ అధికారులతోనూ మాట్లాడాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను వెనక్కు పంపించాలని కోరాము' అని భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.
రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ (32) అనే యువకుడు మరణించారు. అంతేకాదు అతని సమీప బంధువు టీకే జైన్ (27)కు కూడా గాయాలయ్యాయి. బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతని బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి బినిల్ భార్య షాక్‌కు గురయ్యారు. ఆయన్ను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
బినిల్ మృతి పట్ల కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. 'మాస్కోలోని భారత రాయబార కార్యాలయం - మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాము' అని ఎక్స్ పోస్టులో వెల్లడించారు.