తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​, హమాస్​ డీల్​ను స్వాగతించిన భారత్​- క్రెడిట్ కోసం బైడెన్​, ట్రంప్​ పోటీ! - ISRAEL GAZA CEASEFIRE DEAL

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రపంచ దేశాలు- ఇరువైపులా శాశ్వత శాంతికి ఒప్పందం దోహదం చేస్తుందని ఆశాభావం

Israel Gaza Ceasefire Deal
Israel Gaza Ceasefire Deal (Getty IMages)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 11:54 AM IST

Israel Gaza Ceasefire Deal :గాజాలో 15 నెలలుగా ఇజ్రాయెల్‌-హమాస్ సంస్థల మధ్య జరుగుతున్న పోరాటానికి తెరదించే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరిందని తెలియగానే గాజా వాసులు హర్షం వ్యక్తంచేశారు. ఇకనైనా తమ బతుకులు మారతాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికాలోని చికాగోలో ఉన్న పాలస్తీనా వాసులు బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

జోర్డాన్ వాసులు కూడా ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రదర్శనలు చేశారు. హమాస్‌తో ఒప్పందానికి ఆమోదం తెలిపి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి ప్రసంగంలో ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు. గత మే నెలలో తాను ప్రస్తావించిన అంశాలు ఒప్పందంలో ఉన్నాయని చెప్పారు. 8 నెలల చర్చల తర్వాత ఒప్పందం కుదిరిందని వివరించారు.

ఈ ఒప్పందం రాజకీయ పరిష్కారానికి దారి చూపతుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలు పక్కనే పక్కనే శాంతి, సుహృద్భావంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. గాజాలో కాల్పులవిరమణ ఒప్పందం కీలకమైన ముందడుగుగా జపాన్ అభివర్ణించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆస్ట్రేలియా స్వాగతించింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది.

స్వాగతించిన భారత్​
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. బందీలందరినీ విడుదల చేయాలని, కాల్పుల విరమణ పాటించి, చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కారానికి రావాలని నిరంతరం పిలుపునిచ్చినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. ఈ ఒప్పందాన్ని క్లిష్టమైన తొలిఅడుగుగా ఆయన అభివర్ణించారు.

పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీలు తమ మెరుగైన భవిష్యత్తుకు, ఒక నమ్మకమైన రాజకీయ పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన.. ఈజిప్ట్, ఖతార్, అమెరికాలను గుటెర్రెస్ ప్రశంసించారు. పాలస్తీనియన్లకు నిరంతర మానవతాసహాయాన్ని అందించడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉందన్నారు.

ఖతార్, ఈజిప్ట్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ గాజాలో కాల్పుల విరమణ, బందీ విడుదల ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్దోహాలో ఈ ఒప్పందం కుదిరిందని బుధవారం ప్రకటించారు. ఒప్పందంలో ప్రారంభదశ 42 రోజులు ఉంటుందని వివరించారు. ఒప్పందం మేరకు 42 రోజులు గాజాలో యుద్ధం ఆగిపోతుంది.

ట్రంప్​, బైడెన్ మధ్య మాటల యుద్ధం
మరోవైపు, ఆ ఒప్పందం కుదిర్చిన ఘనతను దక్కించుకోవడం కోసం ట్రంప్‌-బైడెన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ కూడా తోడయ్యారు. తన ప్రమాణస్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే హమాస్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. మరోవైపు నెతన్యాహును కూడా విమర్శించే ఓ వీడియోను ఆయన షేర్‌ చేశారు. దీంతో ఇరువర్గాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య డీల్‌ కుదిరిన వార్తలు వచ్చిన వెంటనే ట్రంప్‌ సోషల్‌మీడియా ట్రూత్‌లో స్పందించారు. "ఇది చాలా గొప్ప కాల్పుల విరమణ ఒప్పందం. నవంబర్‌లో నా విజయం ఫలితంగా నా కార్యవర్గం శాంతిని కోరుకుంటుందనే విషయాన్ని ప్రపంచం మొత్తానికి చాటింది. మొత్తం అమెరికన్లు, మిత్రుల భద్రతను కాపాడేందుకు అవసరమైన ఒప్పందాలపై చర్చిస్తామనడానికి ఇది చిహ్నంగా నిలిచింది" అని పేర్కొన్నారు.

బైడెన్‌ తన చివరి ప్రసంగం ప్రారంభంలో మాట్లాడుతూ ‘‘తాను గత మే నెలలో ప్రస్తావించిన అంశాలు ఈ డీల్‌లో ఉన్నాయి. వాటిని ఐరాసతో భద్రతామండలి సహా అన్ని దేశాలు అత్యధికంగా ఆమోదించాయి’’ అని పేర్కొన్నారు. తన కెరీర్‌లోనే చేసిన కఠినమైన డీల్‌ ఇదేనని చెప్పారు. కాబోయే అధ్యక్షుడి బృందంతో కూడా సమన్వయం చేసుకొని చర్చలు ముందుకుతీసుకెళ్లాలని తన బృందానికి సూచించినట్లు పేర్కొన్నారు. కానీ, ఈ శాంతిఒప్పందం కుదరడంలో ట్రంప్‌ పాత్ర లేదని బైడెన్‌ కొట్టి పారేశారు. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ కూడా స్పందించారు. ఈ డీల్‌ కుదిర్చినందుకు జోబైడెన్‌ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు అధిక ప్రాధాన్యం ఇస్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details