Zelenskyy Willing To Step Down : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు పూర్తయిన వేళ జెలెన్‌స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత అని అభివర్ణించిన నేపథ్యంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉండాలని తానేమీ ఆలోచించడం లేదని జెలెన్‌స్కీ అన్నారు.
అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధమే- కానీ 'నాటో'లో చేర్చుకుంటునే: జెలెన్‌స్కీ - ZELENSKYY WILLING TO STEP DOWN
నాటో సభ్యత్వంపై ఆశలు వదులుకున్న జెలెన్‌స్కీ- పదవీ త్యాగానికి కూడా సిద్ధమని వెల్లడి!

Published : Feb 24, 2025, 12:26 PM IST
రష్యాతో యుద్ధానికి ఫుల్‌స్టాప్!
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. బదులుగా నాటో కూటమి సభ్యత్వాన్ని ఉక్రెయిన్‌కు ఇవ్వాలని కోరారు. జెలెన్‌స్కీని నియంత అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించిన నేపథ్యంలో ఓ ఇంటర్‌వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను రాబోయే 20ఏళ్లు లేదా దశాబ్దాలు అధికారంలో ఉండాలని ఆలోచించట్లేదని, ఉక్రెయిన్ భద్రత కోసం మాత్రమే ఆలోచిస్తున్నట్లు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. యుద్ధం ముగింపునకు అమెరికా మధ్యవర్తిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఉక్రెయిన్ పౌరులు తరతరాలు మూల్యం చెల్లించుకునే భద్రతా ఒప్పందాన్ని తాను అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం అందించేందుకు బదులుగా ఆ దేశంలో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే అపారమైన ఖనిజాలను తమకు ఇవ్వాలన్న అమెరికా డిమాండ్‌పై జెలెన్‌స్కీ స్పందించారు. అమెరికా ఇప్పటివరకు గ్రాంట్లు మాత్రమే ఇస్తోందని, రుణాలను కాదని తెలిపారు. మినరల్స్ డీల్‌పై ఒప్పందంపై ఆలోచిస్తామని, కానీ అంతకుముందు యుద్ధాన్ని ముగించాలని కోరారు.
యుద్ధం మొదలైందిలా!
2014 ఫిబ్రవరి 20న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైంది. తమ దేశ భద్రత కోసం నాటో సభ్యత్వం అవసరమని జెలెన్‌స్కీ భావించడం, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమ సరిహద్దుల వరకు నాటోను విస్తరించడం పుతిన్‌కు ఏమాత్రం నచ్చలేదు. దీనితో 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ తొందర్లోనే దారికొస్తుందని పుతిన్ భావించినప్పటికీ, ఆ ఆలోచన తలక్రిందులైంది. బైడెన్ నేతృత్వంలోని అమెరికా ఇచ్చిన ఆయుధ సహకారంతో మాస్కో బలగాలను సమర్థంగా తిప్పికొట్టారు జెలెన్‌స్కీ సైనికులు. అయితే అనేక ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది. మూడేళ్లలో రెండు వైపులా చాలా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఉక్రెయిన్ పట్ల ట్రంప్ వైఖరి ముందే తెలిసిన బైడెన్ కూడా, తాను పదవిలో ఉన్నంత కాలం ఎంత వీలైతే అంత ఆర్థిక, ఆయుధ సాయాలను కీవ్‌కు అందించారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్ పెనం లోంచి పొయ్యిలో పడినట్లయింది. ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ట్రంప్ నిరాకరిస్తున్నారు. సాయం చేయాలంటే తమతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవాలని షరతు పెడుతున్నారు.