ICC Arrest Warrant Israel PM : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు హమాస్ నేతలపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) చీఫ్ ప్రాసిక్యూటర్ కీలక అభ్యర్థనలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని, అలాగే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మరోవైపు ప్రాసిక్యూటర్ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.
ఐసీసీకి చేసిన అభ్యర్థనలు
గాజా స్ట్రిప్‌లో నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవా గాలెంట్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్‌ఖాన్ ఆరోపించారు. వారి చర్యల కారణంగా ఎంతోమంది అమాయక పౌరులు ఆకలితో అలమటిస్తున్నారని, అనేక మంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు. వారు చేసిన మెరుపు దాడులతో ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని పిటిషన్‌లో ఆరోపించారు. ప్రాసిక్యూటర్ వినతిపై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఖండించిన ఇజ్రాయెల్, అమెరికా
ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చేసిన ఆరోపణలను ఇజ్రాయెల్, అమెరికా తీవ్రంగా ఖండించాయి. ఇది దారుణమైన విజ్ఞాపన అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. ఈ తప్పిదాన్ని చరిత్ర ఎప్పటికి గుర్తుంచుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాజ్ అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు తామే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీసీ ప్రాసిక్యూటర్ చేసిన వినతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దౌర్జన్యం అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ నేతలు, హమాస్ తీవ్రవాదులను ఒకే గాటనకట్టడం ఎంతమాత్రం అమోదయోగ్యంగా లేదని జో బైడెన్ తెలిపారు.