Nepal Floods 2024 :నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దాదాపు 66 మంది మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు. 79 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు అధికారులు శనివారం వెల్లడించారు. ఆకస్మిక వరదలు పోటెత్తడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. ఈ వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు.
226 ఇళ్లు పూర్తిగా నీటమునిగిపోయాయని, బాధిత ప్రాంతాల్లో దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన 1,947 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 రాఫ్టింగ్ బోట్లను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్లుగా వెల్లడించారు.
అంధకారంలో 30 లక్షల మంది!
Helen Storm America : మరోవైపు, అతి తీవ్రమైన హరికేన్ హెలెన్ అమెరికాలో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ పెను తుపాను ధాటికి ఇప్పటివరకు దాదాపు 52 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రకృతి విపత్తు కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు చెప్పారు. అనేక మందికి వరద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం.
ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి- 4 హెలెన్ తీవ్ర ప్రభావం చూపింది. ఫ్లోరిడాలో తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, టెనస్సీ గుండా సాగిన హరికేన్ ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దేశాధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.