Danger with Manja Thread : గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాలను వాడటం వల్ల ఈ మధ్య తీవ్ర అనర్థాలకు కారణమవుతుంది. పక్షుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలాగే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు యమపాశంలా చుట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గాలిపటాలు ఎగురవేసి దానికున్న మాంజాలు రోడ్లపై వదిలేసి వెళ్లిపోతుంటారు కొంతమంది. దాంతో అవి అందరికీ ఇబ్బంది కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉన్నా సరే కంటికి కనిపించకుండా గొంతును భాగాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి. ఇలా మరణించిన వారు కూడా లేకపోలేదు.
నలుగురికి గాయాలు : ద్విచక్రవాహనంపై వెళ్తున్న నలుగురు యువకులకు మాంజా దారం తగలి గాయాల పాలైన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం (డిసెంబరు 29)న చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఎస్.సనత్‌కుమార్, సాయిరాం, సాయికుమార్‌లు జనగామలోని సిద్జిపేట రోడ్డు వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాలి పటానికి సంబంధించిన చైనా మాంజా దారం బైక్‌పై ప్రయాణిస్తున్న సనత్‌కుమార్ గొంతుకు తగలడంతో అతనికి తీవ్ర గాయమైంది. బండి అదుపుతప్పి కిందపడింది. బైక్‌పై ఉన్న అతని స్నేహితులు సాయిరాం, సాయికుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సనత్‌కుమార్‌ను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
గొంతు భాగంలో తీవ్ర గాయం : మరో ఘటనలో ఇదే మాదిరిగా ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులతో కలిసి వెళుతున్న పదేళ్ల బాలుడు వీక్షిత్‌కు గొంతు భాగంలో మాంజా దారం తగలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. వీక్షిత్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదకరమైన మాంజా దారాల విక్రయాలపై అటవీ, పోలీసు శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాంజాల వల్ల కలిగే నష్టాలను అందరికీ తెలియజేస్తే కొంత వరకు ఇలాంటివి ఘటనలు తగ్గుతాయంటున్నారు కొంతమంది ప్రజలు. ప్రమాదకరమైన మాంజా దారాలను మార్కెట్లోకి రాకుండా అడ్డుకట్టవేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారికి హెచ్చరిక! - రాబోయే 20 రోజులు జాగ్రత్త!!
పతంగి నింపిన విషాదం - మాంజా చుట్టుకుని జవాన్, గాలిపటం ఎగరేస్తూ మరో నలుగురి మృతి