తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ప్రధాన ఎజెండా! - ఎటూ తేల్చుకోలేని స్థితిలో అమెరికన్లు! - US ELECTIONS 2024

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఆర్థిక వ్యవస్థ సమస్య - ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమర్థవంతమైన నాయకుడి వైపే ఓటర్లు మెుగ్గు

US Elections 2024 Economy
US Elections 2024 Economy (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 7:32 AM IST

US Elections 2024 Economy: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది అధ్యక్ష పోరు రసవత్తరంగా మారింది. ఓటర్లను ఆకర్షించడానికి డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లు హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థ అంశం కీలకంగా మారింది. తాజాగా అసోసియేటెడ్‌ ప్రెస్ - సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తమ ఆర్థిక వ్యవస్థ పేలవంగా ఉందని అమెరికా పౌరులు భావిస్తున్నట్లు తేలింది. కొంతమంది పౌరులు తమ ఆర్థికవ్యవస్థ సరైన దిశలో ప్రయాణించడం లేదని ఆందోళన చెందుతున్నట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో ఏడుగురు ఓటర్లు తమ దేశ ఆర్థిక వ్యవస్థ తప్పుడు దిశలో ప్రయాణిస్తుందని అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాని సమస్యగా ఎక్కవ మంది ఓటర్లు పరిగణిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే నాయకుడికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సర్వే వెల్లడించింది. ఆ విషయంలో కమలా హారిస్‌ కంటే ట్రంప్‌ వెనకబడినట్లు పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థపై విభిన్న ఆలోచనలు
ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్‌, ట్రంప్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలనే దానిపై విభిన్న ఆలోచనలతో ఉన్నారని సర్వేలో పేర్కొంది. అయితే, ఏ ఒక్కరు కూడా తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో పూర్తిగా వివరించలేదు. కమలా హారిస్‌ తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా ట్రంప్‌ తమ ప్రణాళికల కోసం ఒకవేళ అప్పు చేసినా, ఆ ఖర్చును భర్తీ చేయడానికి తగినంత వృద్ధి ఉంటుందని వాదిస్తున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ట్రంప్ అంటున్నారు.

కార్పోరేట్‌ కంపెనీలకు పన్నును 21 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చారు. తద్వారా వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. అలాగే, వివిధ దేశాల నుంచి దిగుమతుల చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు విధిస్తానని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్​ డాలర్‌ను ఉపయోగించని దేశాలపై వంద శాతం సుంకం విధించడానికి వెనుకాడబోనని ట్రంప్‌ అన్నారు. మరోవైపు కమలా హారిస్ మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ధరల పెరుగుదల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. సరైన ప్రణాళికలతో అవకాశాల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇది ఖర్చులు అదుపులో ఉండటానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందన్నారు. ట్రంప్ ప్రవేశపెట్టదలచుకున్న సుంకాలు అమెరికాలో అధిక ధరలకు దారితీస్తాయని కమలా హెచ్చరిస్తున్నారు.

హారిస్​వైపే సగం మంది
ఆర్థిక వ్యవస్థ అంశంలో డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే కమలా హారిస్‌నే ఎక్కువ మంది ఓటర్లు విశ్వసిస్తున్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్ సర్వే వెల్లడించింది. దేశ ఎకానమీని కమలా హారిస్‌ సమర్థవంతంగా నడిపించగలరని 54 శాతం మంది ఓటర్లు విశ్వసిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 46 శాతంమంది కమలాకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్పింది. ఆర్థిక వ్యవస్థ అంశంలో ప్రతి 10 మందిలో నలుగురు ఓటర్లు ట్రంప్‌నకు మద్దతివ్వగా మిగిలిన ఆరుగురు కమలా వైపు మెుగ్గు చూపినట్లు పేర్కొంది. ఈ అంశంలో మెుత్తం నల్ల జాతి ఓటర్లలో మూడింతల మంది కమలాకు సానుకూలంగా ఉన్నట్లు తేలింది. అదే ట్రంప్‌నకు ప్రతి 10 మంది నల్లజాతి ఓటర్లలో ఇద్దరు మాత్రమే మద్దతిచ్చినట్లు తెలిపింది. హిస్పానిక్‌ వర్గం ఓటర్లలో సైతం కమలాకే ఎక్కువ మద్దతు ఉన్నట్లు పేర్కొంది. పది మంది ఓటర్లలో ఆరుగురు కమలాను, నలుగురు ట్రంప్‌ను విశ్వసిస్తున్నట్లు తెలిపింది. అమెరికా మహిళ ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు ట్రంప్‌ కంటే కమలానే ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చగలరని నమ్ముతున్నట్లు సర్వే బయటపెట్టింది. కేవలం మూడింత ఒక వంతు మాత్రమే ట్రంప్‌నకు మద్దతిస్తున్నట్లు తేలినట్లు చెప్పింది. సీనియర్‌ ఓటర్లు కంటే యువ ఓటర్లే ఎక్కువ మందిదేశఆర్థిక వ్యవస్థపై నిరాశగా ఉన్నారని సర్వే తెలిపింది. ఇది హారిస్‌కు ఒకింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది.

తటస్థ ఓటర్లే కీలకం
సెప్టెంబర్‌ నెలలో అసోసియేటెడ్‌ ప్రెస్ నిర్వహించిన సర్వేలో ప్రతి పది మంది ఓటర్లలో 8 మంది ఓటర్లు ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నట్లు తేలింది.ఈ విషయంలో ఉత్తమంగా ఉన్నఅభ్యర్థికే తాము మద్దతిస్తామని చెప్పినట్లు నాటి సర్వే పేర్కొంది. మధ్యతరగతి ప్రజలపై దృష్టి సారిస్తానని కమలా ఇచ్చిన హమీలకు 46 శాతం మంది మద్దతిచ్చినట్లు నాటి సర్వే పేర్కొంది. మరోవైపు అన్ని సర్వే పోల్స్​లో కమలా హారిస్​నే అతి తక్కువ మెజారిటీ తేడాతో విజయం సాధిస్తారని చెబుతున్నాయి. దీంతో తటస్థ ఓటర్లు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తి నెలకొంది. వాళ్ల కోసం అభ్యర్థులు ఇద్దరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details