JD Lakshminarayana on Telugu : సహజసిద్ధంగా వచ్చే భాషే మాతృభాషని విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యం మమ్మీలో రాదన్నారు. పసితనంలో మాతృభాషను చంపేయడం భ్రూణహత్యతో సమానమన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, భాష పరిరక్షణ, రాజకీయ నాయకుల పాత్రపై ఆయన మాట్లాడారు.
"మన ప్రయత్నం ఏమీ లేకుండా మనలో నుంచి వచ్చే భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే మాతృభాష. సహజసిద్ధంగా ఆలోచించే విధానమే మాతృభాష. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని మనం కాపాడుకోవాలి. అమ్మా అన్న మాటలో ఉన్న మాధుర్యం మమ్మీలో ఉండదు. ఎందుకంటే అమ్మ అనే పదం మన మాతృభాషలోనిది కాబట్టి ఆ మాధుర్యం అలా ఉంటుంది. పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు ఈ మాధుర్యం నుంచి మనం దూరం చేయకూడదనేది చాలా ముఖ్యం. చందమామ అని తల్లినేర్పిస్తుంది. కానీ స్కూల్‌కు వెళ్లగానే మూన్ మూన్ అని చెప్పి చందమామ అనే పదాన్ని వారి మెదళ్లలోంచి తీసేస్తున్నారు. బాల్ అని చెప్పి బంతిని వాళ్ల మెదళ్లలోంచి తీసేస్తున్నారు. కాబట్టి పసితనం నుంచే వారి వద్ద నుంచి ఆ భాష తీసివేయడమనేది ఒక బ్రూణహత్యతో సమానమని నేను ప్రతిపాదిస్తున్నాను"- జేడీ లక్ష్మీ నారాయణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి
భాష అభివృద్దిలో రాజకీయ నాయకుల పాత్ర కీలకం : ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే ఇంగ్లీష్‌ను వ్యతిరేకించడం కాదని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఎందుకంటే జాతీయ విద్యావిధానాన్ని పరిశీలించినట్లయితే ఐదో తరగతి వరకు వీలైతే ఎనిమిదో తరగతి వరకు భోదన మాతృభాషలో జరగాలని తెలియజేయడం జరిగిందని వివరించారు. సహజమైన భోదన లేకుండా భోదనాపక్రియ కృత్రిమంగా జరిగితే పిల్లలో రియాలిటీ ఉండదని ఆయన అన్నారు. కృత్రిమత్వమే వస్తుంది అనే విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంటుందని జేడీ అభిప్రాయపడ్డారు. భాష అభివృద్దిలో రాజకీయ నాయకుల పాత్ర చాలా ముఖ్యమైందని ఆయన గుర్తుచేశారు. తెలుగుభాష అనేది రాగానుయుక్త మైన భాష అన్న జేడీ లక్ష్మినారాయణ మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషల్లో సులభంగా ప్రావీణ్యం సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు.
తీర్పులు తెలుగులో ఇస్తేనే సులువుగా అర్థమవుతాయి : జస్టిస్ కె.మన్మథరావు
'భవిష్యత్ తరాలకు అమ్మభాషను అందిద్దాం' - ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వక్తల పిలుపు