తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇస్లామాబాద్​లో పవర్​ఫుల్​ స్పీచ్​- టెర్రరిజంపై పాక్​కు జైశంకర్ బిగ్ షాక్

ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఎస్​సీఓ సదస్సులో భారత ప్రతినిధిగా విదేశాంగమంత్రి జైశంకర్‌ - ఉగ్రవాదం, తీవ్రవాదంపై కీలక వ్యాఖ్యలు

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Jaishankar On Terrorism
Jaishankar On Terrorism (IANS)

Jaishankar On Terrorism :సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం లేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్​సీవో) సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్‌ సారథ్యం వహించారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ- పరోక్షంగా ఆతిథ్య దేశానికి చురకలు అంటించారు.

'సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగుతుంటే ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ వంటి తదితర రంగాల్లో సహకారం వృద్ధి చెందదు. నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే ఆ దేశాలతో సంబంధాలు దూరమవుతాయి. అలాంటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాటిని పరిష్కరించుకోవడానికి కారణాలు కచ్చితంగా ఉంటాయి. సహకారానికి దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలి. అందుకు నమ్మకం చాలా ముఖ్యం. సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని గుర్తించుకోవాలి. అందరూ కలిసి ఐక్యంగా ముందుకుగా సాగితేనే ఎస్​సీఓ సభ్య దేశాలు ఎంతో ప్రయోజనం పొందుతాయి' అని జైశంకర్ అన్నారు.

'పరిస్థితులకు తగిన విధంగా స్పందించాలి'
ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఈ సమావేశంలో జైశంకర్ ప్రస్తావించారు. 'మనం క్లిష్ట సమయంలో కలుస్తున్నాం. ఇప్పుడు రెండు ప్రధాన సంఘర్షలు జరుగుతున్నాయి. వాటి వల్ల సరఫరా గొలుసు నుంచి ఆర్థిక అస్థిరత వరకు- అన్నీ కలిసి వృద్ధి, అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే కొవిడ్ మహమ్మరి చాలా మందిని తీవ్రంగా నాశనం చేసింది. కల్లోల ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన విధంగా ఎస్‌సీఓ స్పందించాలి. అంతే కాకుండా పారిశ్రామిక సహకారం దేశాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందిచగలదు. మార్కెట్లను విస్తరించగలదు. కనెక్టివిటీ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై కలిసి పని చేయడం మంచిది.' అని జైశంకర్ పేర్కొన్నారు.

ఇక ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సభ్యదేశాల ప్రతినిధులకు పాకిస్థాన్ ప్రధాని మంగళవారం రాత్రి తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జైశంకర్, షెహబాజ్‌ కరచాలనం చేసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

ABOUT THE AUTHOR

...view details