Short Film On Telangana Police : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ ప్లాట్‌ఫాం ఏదైనా చాలామంది తమ అభిరుచికి అనుగుణంగా చిన్నచిన్న వీడియోలు, ఫొటోలతో ప్రపంచం ముందుకొస్తున్నారు. తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు. వారికున్న ప్రతిభతో కోరికలను తీర్చుకుంటున్నారు. కాస్త కొత్తదనంతో క్రియేటివిటీ జోడించి ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో మీరూ ఉన్నారా? అయితే ఈ అవకాశం ఖచ్చితంగా మీ కోసమే. పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాలను పురస్కరించుకొని ఔత్సాహికుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ సేవలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా పోటీలను నిర్మల్ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్నారు.
ముందుగా ఏం చేయాలంటే : అక్టోబరు 21తేది నాడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీసులు ఏటా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. ఫొటో, వీడియోగ్రాఫర్లతో పాటు విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలను నిర్వహించనుంది. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపేలా ఇటీవల కాలంలో తీసిన 3 ఫొటోలు, 3 నిమిషాల్లోపు నిడివితో ఉన్న షార్ట్‌ఫిల్మ్ రూపొందించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాలి. వీటిని పెన్‌డ్రైవ్‌లో వేసి, ఫొటోలు 10/8 పరిమాణంలో సిద్ధం చేయాలి.
మూఢనమ్మకాలు- ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తిప్రతిష్ఠలు, సైబర్‌నేరాలు- ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మత్తుపదార్థాల వినియోగం- కలిగే అనర్థాలపై గత సంవత్సరం అక్టోబరు నుంచి ఈ సంవత్సరం అక్టోబరు వరకు తీసిన ఫొటోలు, లఘుచిత్రాలు పోటీలకు పంపించేందుకు వీలు కల్పించారు. జిల్లాస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన వాటిని రాష్ట్ర స్థాయికి పంపించనున్నారు. అక్కడ గెలుపొందిన వారికి నగదు పురస్కారం అందజేస్తారు.
ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలలోని అంశాలు : 1. ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులు విచక్షణతో కూడిన మొబైల్ ఫోన్ వినియోగం. 2. డిగ్రీ ఆపైన విద్యార్థులకు తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర. ఈ అంశాలపై ఆన్‌లైన్ వేదికగా వ్యాసరచన పోటీలుంటాయి. వ్యాసరచనను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రాసేందుకు అవకాశముంది. విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను nirmalitct@gmail.comకి అక్టోబరు 20 లోపు మెయిల్ ద్వారా పంపించాలి. ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపికచేసి బహుమతులు అందజేస్తారు. అన్నింటిని పరిశీలించి మంచి సందేశం ఉన్న వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తారు.
ప్రతిభ చాటుకునే వేదిక...
టెర్రరిస్టులు, మావోయిస్టులు, సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడే క్రమంలో అమరులైన వారి పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ఏటా వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పలురకాల పోటీలు నిర్వహిస్తుంటాం. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన వారికి వివిధ బహుమతులు, ప్రోత్సాహకాలు అందజేస్తాం. తీసిన చిత్రాలు, రూపొందించిన లఘుచిత్రాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్ విభాగంలో ఈనెల 20 లోపు అందజేయాలి. ఏవైనా సందేహాలుంటే 87125 77719 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు
-డా.జి.జానకి షర్మిల, ఎస్పీ, నిర్మల్
హైదరాబాద్‌లో కొత్తగా పలు డివిజన్లు.. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
Sabitha IndraReddy on TS Police : 'తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్'