SCO Summit 2024 Jaishankar Pakistan PM Shehbaz : షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పొరుగుదేశ ప్రధానితో కొద్దిసేపు ముచ్చటించారు. పాకిస్థాన్ కాలమానం ప్రకారం జైశంకర్ విమానం మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు ఇస్లామాబాద్ శివారులోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో దిగింది. అనంతరం ఆ దేశ ఉన్నతాధికారులు జైశంకర్‌కు స్వాగతం పలికారు.
జై శంకర్, షెహబాజ్ కరచాలనం
అయితే ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సభ్యదేశాల ప్రతినిధులకు పాక్ ప్రధాని మంగళవారం రాత్రి తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జైశంకర్, షెహబాజ్ కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఎస్సీవో సదస్సులో భారత బృందానికి జైశంకర్ నేతృత్వం వహిస్తారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015 డిసెంబరులో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌లో పర్యటించారు.
సంకుచిత విధానానికి పాకిస్థాన్ మారు పేరు - భారత్
మరోవైపు, పాకిస్థాన్ ధోరణిని ఐరాస వేదికగా భారత్ మరోసారి ఎండగట్టింది. ప్రజాస్వామ్యం, వైవిధ్యానికి భారత్ ప్రతీక అయితే ఉగ్రవాదం, సంకుచిత విధానం, హింసకు పాకిస్థాన్ మారుపేరు అని పునరుద్ఘాటించింది. వలసపాలన అనే అంశంపై ఐరాసలో సాధారణ చర్చ సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావనను పాకిస్థాన్ తీసుకురావడంపై భారత్ దీటుగా స్పందించింది.
"బహుళత్వం, వైవిధ్యం, ప్రజాస్వామ్యానికి భారత్ ప్రతీక. కానీ, ఇందుకు విరుద్ధంగా పాకిస్థాన్ తీరు ఉంటుంది. ఉగ్రవాదం, సంకుచిత విధానం, పీడించడం వంటి చర్యలకు పాక్ పెట్టింది పేరు. ప్రార్థనా మందిరాలు, మైనార్టీ వర్గాలు, వారి ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే చర్యలు సర్వసాధారణం" అని ఐరాసలో భారత ప్రతినిధి ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ పేర్కొన్నారు. చర్చ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ లేవనెత్తడంపై స్పందించిన ఆయన, అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణల ద్వారా ఐరాస వేదికను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తూనే ఉందని మండిపడ్డారు.