తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే'- డొనాల్డ్‌ ట్రంప్‌ విక్టరీ స్పీచ్ - US ELECTIONS 2024

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయం- అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందంటూ వ్యాఖ్యలు

US Elections 2024
US Elections 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 1:45 PM IST

Updated : Nov 6, 2024, 4:18 PM IST

US Elections 2024 Trump :రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపటనున్నారు. ఆయన రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్‌ అమెరికా 50వ ఉపాధ్యక్షునిగా నియమితులు కానున్నారు. సాధారణ మెజార్టీకి కేవలం 3 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలోనే ఉన్నారు ట్రంప్. ఇప్పటి వరకు 26 రాష్ట్రాల్లో గెలుపొందిన ఆయన, మరో 5 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్నికల్లో అనుకూల ఫలితాల నేపథ్యంలో ట్రంప్‌ ప్రసంగించారు. అమెరికా ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ మార్పు తమ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని, ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని కొనియాడారు. ఇది అమెరికన్లు గర్వించే విజయమని అన్నారు. తన మద్దతుదారులు చప్పట్లతో అభినందనలు తెలుపుతుండగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్‌తో కలిసి ట్రంప్‌ వేదిక పైకి వచ్చారు. అనంతరం ఆయన ప్రసంగించారు.

"ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం. అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని మనం దక్కించుకున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై ప్రతిక్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను. రాబోయే రోజుల్లో సరిహద్దుల సమస్యను పరిష్కరించనున్నా."
-- డొనాల్డ్ ట్రంప్​

ఆ తర్వాత ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గొప్ప ఎంపిక అని ప్రశంసించారు ట్రంప్. కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్‌, ఆయన సతీమణి ఉషా వాన్స్‌కు అభినందనలు తెలిపారు. తన సహాయకులు అందించిన సేవలను కొనియాడారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్​తో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. ప్రజలు ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకుపోయినప్పుడు వారిని రక్షించే చర్యల్లో భాగంగా మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్ ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ట్రంప్ విజయాన్ని కొనియాడుతూ, ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద రాజకీయ పునరాగమనమని వాన్స్ అభివర్ణించారు.

ట్రంప్ గెలిచిన స్థానాలివే
ఐడహో, యూటా, మోంటానా, వయోమింగ్‌, నార్త్‌ డకోట, సౌత్‌ డకోట, నెబ్రాస్కా, కాన్సస్‌, ఓక్లహామా, టెక్సాస్‌, ఐడాహో, మిస్సోరీ, ఆర్కాన్సాస్‌, లుసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడాతోపాటు స్వింగ్‌ రాష్ట్రాలైన నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌ జయకేతనం ఎగురవేశారు.

Last Updated : Nov 6, 2024, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details