Trump on Daylight Saving Time :అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత "డే లైట్ సేవింగ్ టైమ్" విధానానికి ముగింపు పలకనున్నట్టు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తెలిపారు. ఆ పద్ధతిని అనుసరించడం అసౌకర్యంగా ఉందని, దీని వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని అన్నారు. అందుకే రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుందని ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు.
ఈ డే లైట్ సేవింగ్ టైమ్ విధానం రద్దుకు 2021లో 'న్యూ స్టాండర్డ్ టైమ్' అనే బిల్లును సెనేటర్ మార్కో రూబియో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్రంప్ కార్యవర్గంలో స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ డీఎస్‌టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, అప్పట్లో ఆయన తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం రాకపోవడం వల్ల అధ్యక్షుడు జో బైడెన్ ముందుకురాలేదు. తాజాగా తాను దీన్ని రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు.
డే లైట్ సేవింగ్ టైమ్ అంటే?
భూమధ్య రేఖకు కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు పగలు, రాత్రి దాదాపు 12 గంటల చొప్పున సమంగా ఉంటాయి. మిగతా దేశాల్లో పగటి సమయం వేసవికాలంలో ఎక్కువగానూ, శీతాకాలంలో తక్కువగానూ ఉంటుంది. దీంతో పగటి పూటను ప్రజలు ఎక్కువసేపు ఆస్వాదించడం కోసం 'డే లైట్ సేవింగ్ టైం' విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏటా వేసవి కాలం (మార్చి చివరి ఆదివారం) గడియారంలో ఉండే అంతర్జాతీయ ప్రామాణిక సమయాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. శీతాకాలం ప్రారంభం (అక్టోబర్ చివరి వారం)లో మళ్లీ వెనక్కి జరిపి యథాస్థితికి తీసుకొస్తారు.
ఈ 'డే లైట్ సేవింగ్ టైం'ను 1895లో జార్జ్ హడ్సన్ అనే కీటకాల శాస్త్రవేత్త ప్రతిపాదించారు. తన కార్యాలయంలో పని పూర్తికాగానే కీటకాల వేటకు వెళ్లేవాడట. కానీ, పనివేళలు ముగిసేసరికి కొన్ని సార్లు చీకటి పడుతుండటం వల్ల గడియారంలో సమయాన్ని గంట వెనక్కి జరిపితే సాయంత్రం వేళ వెలుగు ఉన్నప్పుడు వేటకు వెళ్లొచ్చని భావించాడు. అందుకే డే లైట్ సేవింగ్ టైం ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే, అంతకుముందే అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు బెంజిమన్ ఫ్రాంక్లిన్ 1784లో ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు ఓ వాదన ఉంది. తొలిసారి 1916లో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీలు, ఆ తర్వాత యూరప్, అమెరికా ఈ విధానాన్ని అమలు చేశాయి. రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ ఈ విధానాన్ని ఇంధనం, సైనిక శక్తిని పొదుపు చేయడం కోసం బాగా ఉపయోగించుకుంది. అయితే ఈ విధానం తప్పనిసరి కాదు. కానీ, 70కి పైగా దేశాలు పాటిస్తున్నాయి. భారత్ సహా ఆసియా, ఆఫ్రికా దేశాలు దీన్ని పాటించట్లేదు. అమెరికాలోనూ కొన్ని ప్రాంతాలు దీనికి దూరంగా ఉంటున్నాయి.