Annapurna Jayanti 2024 : ఎంత ఐశ్వర్యమున్నా ఆకలేస్తే తినేది పట్టెడన్నం మాత్రమే. సమయానికి అన్నం తినడం, తిన్న అన్నాన్ని అరిగించుకోవడం కూడా ఐశ్వర్యమే. ఈ ఐశ్వర్యానికి కారణం అన్నపూర్ణ మాతయే. త్వరలో రానున్న అన్నపూర్ణ జయంతి సందర్భంగా ఆ రోజు ఎలా జరుపుకోవాలి. ఎలాంటి పూజలు చేయాలి అనే విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అన్నపూర్ణ జయంతి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణ జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 4:19 గంటలకు మొదలై మరుసటి రోజు డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:37 గంటల వరకు ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి డిసెంబర్ 15 ఆదివారం రోజునే అన్నపూర్ణ జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభ సమయం.
అన్నపూర్ణ జయంతి పూజా విధానం
అన్నపూర్ణ జయంతి ఆదివారం రోజు వచ్చింది. అందుకే ముందుగా సూర్యోదయంతోనే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. పూజామందిరాన్ని గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి. అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పసుపు రాసిన పీటపై ఉంచి గంధం, కుంకుమలతో అలంకరించాలి. తర్వాత అమ్మవారి ముందు ధూపం, దీపం వెలిగించాలి.
పూజ ఇలా.
అన్నపూర్ణ దేవిని తెల్ల చేమంతులతో, తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తూ అష్టోత్తర శతనామ అర్చన చేయాలి. ఈ రోజు అమ్మవారికి, అన్ని కూరగాయలు, బియ్యంతో తయారు చేసిన కదంబం గోధుమ పిండితో తయారు చేసిన పూరీలు, గోధుమ రవ్వ హల్వా, అల్లం గారెలు, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటివి నివేదించాలి. ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు స్వీకరించాలి. పూజ పూర్తయ్యాక శ్రీ ఆది శంకరులు రచించిన అన్నపూర్ణాష్టకం పఠించాలి.
ఈ దానాలు శ్రేష్టం
సాధారణంగా అన్నపూర్ణాదేవి లోకానికి ఆహారాన్ని అందించే దేవత. అందుకే ఈ రోజు అన్నదానం నిర్వహిస్తే వంశంలో ఎవరికీ అన్నానికి లోటుండదని శాస్త్రవచనం. అలాగే అన్నపూర్ణ జయంతి రోజు అన్నదానం, వస్త్ర దానం చేసిన వారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అని ఆర్తితో ఆ తల్లిని ప్రార్ధిస్తే తన బిడ్డలమైన మనకు ఆహారాన్ని సమకూర్చే దేవత అన్నపూర్ణాదేవి. లోకంలో అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు. రానున్న అన్నపూర్ణ జయంతిని మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుదాం.
ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.