US Illegal Immigrant Population : అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారి గణాంకాలను US ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్-I.C.E ఇటీవల విడుదల చేసింది. దేశంలో మొత్తం 14.45 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు తెలిపింది. ఈ జాబితాలో 2 లక్షల 61 వేల మందికిపైగా అక్రమ వలసదారులతో హోండరస్ మొదటిస్థానంలో నిలవగా రెండున్నర లక్షల మందితో గ్వాటెమాలా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో సుమారు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు I.C.E నివేదిక తెలిపింది. దాదాపు 37 వేల మంది చైనీయులు దేశ బహిష్కరణ ముప్పు ఎదుర్కోనున్నారు.
అమెరికాలో లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారంతా చట్టబద్ధత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి I.C.E నుంచి అనుమతిరావడానికి ఏళ్ల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్రమ వలసదారులపై కనికరం చూపే ప్రసక్తే లేదని, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారిని దేశం నుంచి వెళ్లగొడతామని ఇటీవల ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయలు వ్యవహారంలో భారత్ నుంచి సరైన స్పందన లేదని I.C.E తెలిపింది. ఆ సమస్యకు ఇరుదేశాలు దౌత్య మార్గాల్లో పరిష్కారం అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తామని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లల్లో ఎక్కువ మంది అమెరికాలో పుట్టి పెరిగారని, అనేక మంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వారి సమస్యలపై దృష్టిసారిస్తామని ట్రంప్ హామీ ఇవ్వడం వల్ల కొంతమంది ప్రవాస భారతీయలకు ఉపశమనం కలిగింది.