తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతుచిక్కని మాథ్యూ క్రూక్స్ స్టోరీ - ట్రంప్‌పై హత్యాయత్నం ఇంకా మిస్టరీనే! - Donald Trump Attacked - DONALD TRUMP ATTACKED

Donald Trump Shooter : డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్‌‌ ఎవరికీ అంతుచిక్కడం లేదు. అతడు ఎందుకలా చేశాడు అనేది పెద్ద మిస్టరీగా మిగిలింది. ఎప్పుడూ సైలెంటుగా ఉండే క్రూక్స్ అకస్మాత్తుగా ఇతరుల ప్రాణాలు తీసే రాక్షసుడిగా ఎందుకు మారాడు అనేది తెలుసుకోలేక ఎఫ్‌ఐబీ అధికారులు తల పట్టుకుంటున్నారు.

Donald Trump Shooter
Donald Trump Shooter (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 11:57 AM IST

Donald Trump Shooter: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్‌‌పై విచారణలో పెద్దగా పురోగతి రాలేదు. అతడు ఎందుకు ఈ హత్యాయత్నం చేశాడు ? క్రూక్స్ వెనుక ఎవరు ఉన్నారు ? అనేది ఇంకా దర్యాప్తు సంస్థలు గుర్తించలేకపోయాయి. విచారణలో భాగంగా అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 100 మందికిపైగా థామస్ మాథ్యూ క్రూక్స్‌‌ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబీకులను ప్రశ్నించినా పెద్దగా సమాచారం దొరకలేదు. ఒంటరిగా ఉండటానికి క్రూక్స్ ఇష్టపడేవాడని అందరూ ఎఫ్‌బీఐకి చెప్పినట్లు తెలిసింది. అతడి స్మార్ట్‌ఫోన్‌‌ను, కంప్యూటర్‌ను, సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పట్టినా ఎందుకు దాడి చేశాడు అనేది తెలియరాలేదు. క్రూక్స్ ఇల్లు, కారులో ఎఫ్‌బీఐ తనిఖీలు చేసినా దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలేవీ లభించలేదు. ప్రస్తుతం అతడి ఇల్లు పోలీసుల అదుపులోనే ఉంది.

తండ్రి తుపాకీతో
థామస్ మాథ్యూ క్రూక్స్‌‌ తండ్రి మాథ్యూ క్రూక్స్ 2013లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ మిఫ్ఫ్లిన్‌లో ఉన్న గాండర్ మౌంటైన్ రిటైల్ ఔట్‌డోర్ చైన్ నుంచి తుపాకీని కొన్నారు. ఆ ఏఆర్-15 మోడల్ తుపాకీతోనే ట్రంప్‌పై మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. అతడు హైస్కూల్‌లో ఉండగా స్కూలులోని రైఫిల్ టీమ్‌లో సభ్యత్వం కోసం ప్రయత్నించాడు. అయితే టార్గెట్​ను సరిగ్గా గురిపెట్టలేకపోతున్నాడని అతన్ని టీమ్‌లోకి తీసుకోలేదు. చివరకు తన కుటుంబ సభ్యుల ద్వారా థామస్ మాథ్యూ క్రూక్స్‌‌ క్లైర్టన్ స్పోర్ట్స్‌మెన్ క్లబ్‌లో సభ్యుడిగా చేరాడు. ఈ క్లబ్ ఇటీవల ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరిగిన బెతెల్ పార్క్‌ ఏరియాకు 17 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ క్లబ్‌లో గరిష్ఠంగా 187 గజాల దూరం వరకు గన్ షూటింగ్ టార్గెట్లను ప్రాక్టీస్ చేసే విశాలమైన ప్రాంతం ఉంది.

కాల్పులకు ముందురోజు ప్రాక్టీస్
బట్లర్ నగరంలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరగడానికి ఒక రోజు ముందు థామస్ క్రూక్స్ ఈ స్పోర్ట్స్‌మెన్ క్లబ్‌ రైఫిల్ రేంజ్‌లోనే ముమ్మరంగా ప్రాక్టీస్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ట్రంప్‌పై కాల్పులు జరపడానికి కొన్ని గంటల ముందే నగరంలోని ఓ దుకాణం నుంచి తుపాకీ కోసం 50 రౌండ్ల 5.56mm బుల్లెట్లను అతడు కొన్నాడు. అనంతరం ట్రంప్ సభ జరిగే ప్రదేశానికి కారులో ఒంటరిగా బయలుదేరాడు. సభా స్థలానికి 1760 అడుగుల దూరంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో కారును పార్క్ చేశాడు. తుపాకీ చేతిలో పట్టుకొని గ్యాస్ స్టేషన్ నుంచి దాదాపు అరగంట పాటు నడుస్తూ వచ్చి ట్రంప్ సభా స్థలికి సమీపంలోని భవనంపైకి ఎక్కాడు.

ఆ యూట్యూబ్ ఛానల్ లోగోతో టీషర్ట్
ట్రంప్‌పై కాల్పులు జరపడానికి క్రూక్స్‌‌ కామో షార్ట్‌, బ్లాక్ బెల్ట్‌, ఆయుధాల గురించి వివరించే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లోగోతో ఉన్న బూడిద రంగు టీ షర్టును ధరించి వచ్చాడు. క్రూక్స్‌ను పరిసర ప్రాంత ప్రజలు గుర్తించి పోలీసులు, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకునేలోపే క్రూక్స్ రెండు రౌండ్ల ఫైరింగ్ చేశాడు. వాటిలోనే ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి ఎగువ భాగంలో తాకింది. లక్కీగా ప్రసంగం చేస్తూ ట్రంప్ మెడను తిప్పడం వల్ల ఒక బుల్లెట్ తాకకుండా వెళ్లిపోయిది. ట్రంప్ సభకు వచ్చిన ఓ అగ్నిమాపక విభాగం ఉద్యోగి బుల్లెట్ తగిలి మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు క్రూక్స్‌‌ కాల్పులు జరిపిన 15 సెకన్లలోనే అతడిని చుట్టుముట్టి అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

రిపబ్లికన్ పార్టీలోకి ఆరోజే
ఎఫ్‌బీఐ దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. అదేమిటంటే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే క్రూక్స్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీలో సభ్యుడిగా చేరాడు. ఆ సందర్భంగా అతడు పార్టీకి దాదాపు రూ.1200 విరాళం కూడా ఇచ్చాడు. కానీ, ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్‌పై క్రూక్స్ ఎందుకు కాల్పులు జరిపాడన్నది మిస్టరీగా మారింది.

అఫ్గాన్​లో భారీ వర్షాలు - 40 మంది మృతి

ట్రంప్ పార్టీ కన్వెన్షన్ సమీపంలో వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు - అమెరికాలో టెన్షన్ టెన్షన్

ABOUT THE AUTHOR

...view details