తెలంగాణ

telangana

ETV Bharat / international

'రష్యాతో యుద్ధానికి అసలు కారణం ఉక్రెయినే'- జెలెన్​స్కీపై ట్రంప్​ ఫైర్ - TRUMP ON RUSSIA UKRAINE WAR

రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అసలు కారణమని మండిపడ్డ డొనాల్డ్‌ ట్రంప్‌- రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డ అమెరికా అధ్యక్షుడు

Trump On Russia Ukraine War
Trump On Russia Ukraine War (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2025, 3:38 PM IST

Trump On Russia Ukraine War : అమెరికా, రష్యా జరిపిన చర్చలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యల పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో విలేకర్ల సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో కీవ్‌ను భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా, రష్యా ప్రయత్నిస్తుంటే చర్చల్లో పాల్గొనబోమని జెలెన్‌స్కీ చెప్పడం ఏంటని మండిపడ్డారు.

అసలు యుద్ధానికి ఉక్రెయినే కారణమని ఆరోపించారు. మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎప్పుడో ముగించాల్సిందని ట్రంప్‌ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఆ పని ఎందుకు చేయలేదని జెలెన్‌స్కీని ట్రంప్‌ ప్రశ్నించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను పరోక్షంగా తప్పుపట్టారు. తక్కువ భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. గత నాలుగేళ్లు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేదేకాదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

"యుద్ధాన్ని ముగించే శక్తి తనకు ఉందని భావించాను. ఆ దిశగా ప్రక్రియ సజావుగా సాగుతోందని అనుకున్నాను. కానీ చర్చలకు తమను ఆహ్వానించలేదనే వాదన (ఉక్రెయిన్‌) వినిపించింది. మరి మీకు (జెలెన్‌స్కీ) మూడేళ్ల సమయం ఉంది, ఏం చేశారు? ఈ మూడేళ్లలో మీరు (జెలెన్‌స్కీ) యుద్ధాన్ని ఆపాల్సింది కదా? మీరు యుద్ధాన్ని ప్రారంభించకుండా ఉండాల్సింది. మూడేళ్లలో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా? వారి భూమిని వారికి (ఉక్రెయిన్‌) పూర్తిగా వెనక్కు ఇప్పించేలా నేను ఒక ఒప్పందం కుదిర్చే అవకాశం ఉంది. యుద్ధంలో ఒక్కరు కూడా చనిపోకుండా ఉండేవారు. ఒక్క నగరం కూడా విధ్వంసానికి గురికాకుండా ఉండేది. ఒక్క భవనం కూడా కూలిపోకుండా ఉండేది. కానీ ఇది జరగకూడదని వారు (బైడెన్) వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బైడెన్‌ ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాలేదు. ఇది చాలా బాధాకరం, విషాదకరం"
- డొనాల్డ్‌ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఈ నెలాఖరులో తాను పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ట్రంప్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని రష్యా కోరుకుంటోందని తెలిపారు. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారన్న ట్రంప్ ఇది బుద్ధిమాలిన యుద్ధమని అభివర్ణించారు. అటు శాంతి చర్చల విషయంలో తమను పక్కనబెట్టారన్న ఉక్రెయిన్‌ ఆరోపణలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌ సహా ఐరోపా సమాఖ్యతోనూ చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details