Cyber Attack On Russia : రష్యాలోని కజన్ వేదికగా 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ సైబర్ దాడులు జరగడం కలకలం రేపింది! బుధవారం సదస్సు జరుగుతున్న సమయంలో రష్యాలోని విదేశాంగ మంత్రిత్వశాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు. భారీగా సైబర్ దాడులు జరిగాయని వెల్లడించారు.
బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సమయంలో రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌పై భారీగా సైబర్ దాడులు జరిగాయి. మంత్రిత్వశాఖ సేవకు అంతరాయం కలిగించే డీడీఓఎస్‌పై దాడులు జరిగినట్లు గుర్తించాం. మంత్రిత్వశాఖ తరచూ ఇలాంటి దాడులు ఎదుర్కొంటున్నా తాజాగా జరిగినవి తీవ్రస్థాయిలో ఉన్నాయి.
-- మరియా జఖరోవా, అధికార ప్రతినిధి
మరోవైపు, బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సుల్లో దౌత్యం, చర్చలకు భారత్ మద్దతిస్తుందని, యుద్ధానికి కాదని మోదీ పునరుద్ఘాటించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులు, ఉగ్రవాదం వంటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు
బ్రిక్స్‌లో కొత్తగా చేరిన దేశాలను మోదీ ఆహ్వానించారు. నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో తీసుకోవాలని, కూటమి వ్యవస్థాపక దేశాల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. ఐరాస భద్రతామండలి, అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటివాటిలో కూడా సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. ప్రపంచ సంస్థలను సమూలంగా మార్చేయడం తమ ఉద్దేశం కాదని, వాటిని సంస్కరించడమే ధ్యేయమని చెప్పారు.తాగునీరు, ఆహారం, ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాల్లో భద్రత కల్పించడం ప్రపంచ దేశాలన్నింటికి ప్రాధాన్యాంశం కావాలని ఆకాంక్షించారు. సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ విషయంలోనూ అంతర్జాతీయ నియంత్రణల కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఈ కూటమిలో చేరేందుకు 30 దేశాలు ఆసక్తిగా ఉన్నాయని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. భారత ఆర్థికవృద్ధిపై ఆయన ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. అధిక ఆర్థిక వృద్ధి కోసం అందరూ మాట్లాడుతున్నా మోదీ మాత్రం దీనిని విజయవంతంగా సాధించి చూపించారని కొనియాడారు.