China Fire Accident Today :చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 39 మంది మరణించారు. ఆగ్నేయ జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం జరిగిందీ దుర్ఘటన. ఓ షాపింగ్ మాల్ పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదాలు పదే పదే జరగకుండా చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు.
34కు చేరిన మృతుల సంఖ్య
మరోవైపు, చైనాలోని యునాన్ ప్రావిన్స్ పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మరణించిన వారి సంఖ్య 34కి చేరింది. మరో పది మంది గల్లంతయ్యారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, కురుస్తున్న మంచు మధ్య రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, రెస్క్యూ డాగ్‌ల సహాయంతో 1,000 మందికి పైగా ఘటనాస్థలిలో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 900 మందికి పైగా చుట్టుపక్క గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించినట్లు వెల్లడించారు.
కొన్నినెలల క్రితం,ఉత్తర చైనా షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు గనుల కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది మరణించారు. 38 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భవనం ఓ ప్రైవేట్ బొగ్గు గనుల కంపెనీకి చెందినదని చెప్పారు. లియులియాంగ్ నగరంలో ఉన్న ప్రైవేట్ యోంగ్జు బొగ్గు గని కంపెనీకి చెందిన భవనంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఈ కంపెనీ సంవత్సరానికి 120 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.