తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా మరోసారి కవ్వింపు చర్యలు- తైవాన్ చుట్టూ 125 యుద్ధవిమానాలతో సైనిక విన్యాసాలు

తైవాన్‌ను హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కవ్వింపు చర్యలకు దిగిన చైనా- భారీ ఎత్తున సైనిక విన్యాసాలు

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

China Military Drills Near Taiwan
China Military Drills Near Taiwan (Getty Images)

China Military Drills Taiwan : తైవాన్‌ను హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో చైనా మరోసారి కవ్వింపు చర్యకు దిగింది. తైవాన్‌ను చుట్టుముట్టి భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ డ్రిల్స్‌లో చైనా త్రివిధ దళాలు పాల్గొన్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలతో తైవాన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తైవాన్ సైన్యం సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 125 యుద్ధవిమానాలను చైనా వినియోగించిందని తైవాన్ వెల్లడించింది. చైనా చర్యలు ఇండో- పసిఫిక్‌ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని మండిపడింది.

సోమవారం ఉదయం 'జాయింట్‌ స్వోర్డ్‌-2024B' పేరుతో ఈ సైనిక విన్యాసాలు చేపట్టినట్లు చైనా రక్షణశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందులో చైనా ఆర్మీ, నౌకాదళం, వైమానికదళం పాల్గొన్నాయి. ఈ విన్యాసాలు తైవాన్‌ వేర్పాటువాదుల కార్యకలాపాలకు గట్టి హెచ్చరికగా నిలవనున్నట్లు చైనా పేర్కొంది. జాతీయ సార్వభౌమత్వం, ఐక్యతను రక్షించే చర్యలుగా ఈ విన్యాసాలు నిలవనున్నట్లు వెల్లడించింది. తైవాన్‌ కూడా తమ దేశంలో భాగమేనని చైనా వాదిస్తోంది. ఇటీవల చైనా ప్రధాన భూభాగంలో తైవాన్‌ కలవాలన్న చైనా డిమాండ్‌కు తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె నిరాకరించారు. అందుకు ప్రతిస్పందనగానే భారీస్థాయిలో తైవాన్‌ను దిగ్బంధించి సైనిక విన్యాసాలు చేపట్టినట్లు చైనా రక్షణశాఖ తెలిపింది.

సరిహద్దుల్లో తైవాన్ అప్రమత్తం
తమ జలాల సమీపంలో చైనా విన్యాసాలు నిర్వహించడాన్ని తైవాన్‌ తీవ్రంగా ఖండించింది. చైనా విన్యాసాల నేపథ్యంలో తమ గగనతల, సముద్ర గస్తీని అప్రమత్తం చేసినట్లు తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె తెలిపారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి భంగం కలిగించడానికే చైనా ఈ చర్యలకు పూనుకున్నట్లు విమర్శించారు. బలాన్ని ఉపయోగించి పొరుగుదేశాలను చైనా ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపించారు. చైనా బెదిరింపుల నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, జాతీయ భద్రతను తైవాన్‌ ప్రభుత్వం కాపాడుతుందని లాయ్‌ తెలిపారు. ఈ డ్రిల్స్‌పై స్పందించిన తైవాన్ రక్షణశాఖ మంత్రి సన్‌-లీ-ఫాంగ్‌ ఇవి ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతకు ముప్పు కలిగిస్తాయని మండిపడ్డారు. తైవాన్‌ సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది వేడుకల్లోపు తైవాన్‌ను బలవంతంగానైనా తమ దేశంలో కలుపుకోవాలని చైనా భావిస్తోంది. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ పుట్టి 2049కు వందేళ్లు పూర్తవుతాయి. ఆ సమయంలోపు తన లక్ష్యం నెరవేర్చుకోవాలని చైనా తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చేపట్టింది. ఎటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా తమ భూభాగంలో కలవాలని చైనా పలుమార్లు తైవాన్‌ను హెచ్చరించింది. అయితే తైవాన్‌ నాయకత్వం అందుకు తలవంచకపోవడం వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఇది రెండోసారి
గత 5 నెలల్లో తైవాన్‌ను చుట్టుముట్టి చైనా సైనిక విన్యాసాలు చేపట్టడం ఇది రెండోసారి. మొదటిసారి తైవాన్‌ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌-తె ప్రమాణస్వీకారం చేసిన అతి కొద్దికాలానికే చైనా నిర్వహించింది. ఈ చర్యలు లాయ్‌ చింగ్‌ను చైనా ఏ స్థాయిలో ద్వేషిస్తుందో తెలపడానికి నిదర్శనంగా నిలిచాయి. తైవాన్‌ అధ్యక్ష ఎన్నికలో లాయ్‌ చింగ్‌కు ఓటు వేయకూడదని తీవ్రస్థాయిలో తైవాన్‌ పౌరులను చైనా హెచ్చరించినా వాటిని లెక్కచేయని ప్రజలు ఆయన్నే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం తెప్పించడం వల్ల భారీ ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకూ తైవాన్‌కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికా దీనిపై ఎలా స్పందిస్తోందో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details