China Arunachal Pradesh Issue : చైనా మరోసారి భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్‌పై విషం కక్కింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 30 కొత్త పేర్లు పెట్టింది. ఈమేరకు వివరాలతో ఒక లిస్టును చైనా పౌర వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేశారంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
కొత్త పేర్లతో నాలుగో జాబితా
'మే 1 నుంచి అరుణాచల్‌లోని ఆ 30 ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలి. చైనా సార్వభౌమాధికార హక్కులకు క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదు. వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్‌లోకి అనువదించకూడదు' అని ఆ లిస్టులో పేర్కొన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు పేర్లు పెడుతూ మూడు లిస్టులను చైనా విడుదల చేయగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను 2017లో చైనా పౌర వ్యవహారాల శాఖ విడుదల చేసింది. 2021లో అరుణాచల్‌లోని 15, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మరో రెండు లిస్టులను డ్రాగన్ విడుదల చేసింది.
చైనా కవ్వింపు చర్యలే
అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగ్నాన్, దక్షిణ టిబెట్ అని పిలవడమే కాకుండా భారత్ భూభాగానికి చెందిన ప్రాంతాలకు పేర్లు కూడా పెట్టడం వల్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే అంటూ ఇటీవల అమెరికా చేసిన ప్రకటనతో అగ్గి మీద గుగ్గిలమైన చైనా, తాజాగా భారత్‌ను కవ్వించేలా అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టి అధికారికంగా విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పదేపదే చేస్తున్న వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మార్చి 23న సింగపూర్‌లో జరిగిన ఓ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అలానే అరుణాచల్ అనేది భారతదేశంలోని భూభాగమే అని స్పష్టం చేశారు.