Canada Cabinet Minister Resigns :కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో క్రిస్టియా ఫ్రీలాండ్ అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందారు. అలాంటి ఆమె, ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అలాగే లిబరల్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతానని పేర్కొన్న ఆమె, తదుపరి ఎన్నికల్లో టొరంటో నుంచి మళ్లీ పోటీ చేస్తానన్నారు.
'ప్రస్తుతం మన దేశం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు అమెరికాకు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ 25శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అలాంటి ముప్పును మనం తీవ్రంగా పరిగణించాలి' అని క్రిస్టియా ఫ్రీలాండ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా ఉత్తమ మార్గాల కోసం అన్వేషించామని, ఈ క్రమంలో ఇద్దరి (ట్రూడోతో) అభిప్రాయాలు కలవలేదని తెలిపారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో అందుకు క్రిస్టియా, తన పదవికి రాజీనామా చేయడమే సరైందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తొలిసారి ఎన్నిక
2013లో క్రిస్టియా తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అనంతరం అధికారం చేపట్టిన ట్రూడో కేబినెట్‌లో చేరారు. వాణిజ్యం, విదేశాంగ మంత్రిగా ఆమె పనిచేశారు. 2020 ఆగస్టు నుంచి ఆర్థికమంత్రిగా కొనసాగిన ఆమె అమెరికా, ఈయూలతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలకు నాయకత్వం వహించారు. అయితే దేశ ఆర్థిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంటుకు నివేదించనున్న కొన్ని గంటల్లోనే క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.