OpenAI Whistleblower Suchir Balaji Dead : ప్రముఖ టెక్ కంపెనీ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రజా వేగు సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సంతతికి చెందిన బాలాజీ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. నవంబర్ 26న అతడు మరణించగా, ఆ విషయం ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇది ఆత్మహత్య అయ్యి ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించారు.
ఓపెన్ ఏఐపై సుచిర్ ఆరోపణలు
ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఓపెన్ ఏఐ పలు కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసిన మూడు నెలల తర్వాత బాలాజీ మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బాలాజీ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 2020 నవంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు ఓపెన్ ఏఐలో పని చేశారు బాలాజీ. గతంలో న్యూయార్క్ టైమ్స్‌తో ఈ యువ టెకీ మాట్లాడారు. సమాజానికి మేలుకంటే హాని చేసే టెక్నాలజీల కోసం ఇక ఏమాత్రం పనిచేయాలని తాను కోరుకోవడం లేదని, అందుకే ఆ సంస్థను వీడానని తెలిపారు.
ఓపెన్ ఏఐపై తీవ్ర ఆరోపణలు
2022లో ఓపెన్ ఏఐపై రచయితలు, ప్రోగ్రామర్లు, జర్నలిస్టుల తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన ప్రోగ్రామ్‌ను డెవలప్ చేయడానికి ఓపెన్ ఏఐ తమ కాపీరైట్ కంటెంట్‌న ఉపయోగించుకుందని ఆరోపించారు. దాంతో తన వాల్యుయేషన్‌ను 150 బిలియన్ డాలర్లకు పెంచుకుందని పేర్కొన్నారు. కాగా, చాట్ జీపీటీని ట్రైన్ చేయడానికి వారి సమాచారాన్ని ఉపయోగించి, పలు వ్యాపారాలు, ఆంత్రప్రెన్యూర్లపై ఓపెన్ ఏఐ ప్రతికూల ప్రభావం చూపించిందని అక్టోబర్ 23న న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో బాలాజీ పేర్కొన్నారు. భారత్‌లో కూడా ఓపెన్ ఏఐపై కాపీరైట్ ఉల్లంఘనల కేసు నమోదైంది.