Ambani Adani Networth Drop Below 100 Billion Dollors : వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు వైదొలిగారు. ఈ ఏడాది వారి సంపద భారీగా తగ్గడం వల్ల వారిద్దరు వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్ అయినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో వ్యాపారపరంగా వారు ఎదుర్కొంటున్న ఒడుదొడుకులే ఇందుకు కారణమని వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది జులైలో 120.8 బిలియన్ డాలర్ల ఉండగా డిసెంబర్ 13 నాటికి 96.7 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అటు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద ఈ జూన్‌లో 122.3 బిలియన్ డాలర్లకు చేరగా డిసెంబర్ నాటికి ఏకంగా 40 బిలియన్లు తగ్గి 82.1 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, ఎనర్జీ విభాగాలు ఆశించిన మేర రాణించకపోవడం వల్ల అంబానీ వ్యక్తిగత సంపదలో క్షీణత కనిపించినట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత్‌లో పెద్దఎత్తున లంచాలు ఇచ్చారని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైంది.
ఆ వార్తలు వచ్చిన వెంటనే అదానీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా గతేడాది అదానీ సంస్థపై ఆరోపణలు చేసింది. కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపించింది. వీటిన్నింటి కారణంగా అదానీ సంపదలో తగ్గుదల నమోదైందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు వచ్చే ఏడాది కూడా ఆ సంస్థ మార్కెట్ విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనావేసింది.
అయితే మెుత్తంగా చూసుకుంటే భారత్‌లో ఉన్న సంపన్న వ్యక్తులు అభివృద్ధి చెందుతూనే ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. భారత సంపన్నుల్లోని మెుదటి 20మంది ఈ ఏడాది ప్రారంభం నుంచి 67.3 బిలియన్ల డాలర్ల సంపదను ఆర్జించినట్లు పేర్కొంది. వీరిలో HCL టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ 10.8 బిలియన్ డాలర్లు, జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ 10.1 బిలియన్ డాలర్లు ఆర్జించినట్లు వెల్లడించింది.