BNP Demands Extradition Of Sheikh Hasina To Bangladesh :ఇండియాలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కోరింది. హసీనాపై బంగ్లాలో హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్‌ను డిమాండ్ చేసింది.
''మన పొరుగుదేశం షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడం విచారకరం. అక్కడి నుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. హసీనాను మీరు (ఇండియాను ఉద్దేశిస్తూ) న్యాయబద్ధంగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలి. పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు మా దేశ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెను విచారణ ఎదుర్కోనివ్వండి'' అని బీఎన్‌పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగీర్ పేర్కొన్నారు.
హసీనాపై 31 కేసులు నమోదు
రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో బంగ్లాదేశ్ హింసాత్మకంగా మారింది. ఈ అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. వారి కుటుంబసభ్యుల మరణాలకు హసీనానే కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. దీంతో షేక్ హసీనాపై, ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు హసీనాపై 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 హత్య అభియోగాలు ఉన్నాయి. మారణహోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై నాలుగు కేసులు, కిడ్నాప్‌నకు సంబంధించి మరో కేసు కూడా నమోదైంది.