తెలంగాణ

telangana

ETV Bharat / international

'నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు- రష్యా అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ప్రపంచానికి తెలిసింది!'

Biden On Navalny Death : రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఆయన మరణ వార్త విని తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెప్పారు.

Biden On Navalny Death
Biden On Navalny Death

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 12:03 PM IST

Updated : Feb 17, 2024, 12:59 PM IST

Biden On Navalny Death : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. నావల్నీ మృతికి అధ్యక్షుడు పుతినే కారణమని బైడెన్ ఆరోపించారు. మరణ వార్త విని తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెప్పారు. నావల్నీ మృతికి కారణం ఏదైనప్పటికీ- బాధ్యత మాత్రం పుతిన్‌దేనని అన్నారు. పుతిన్ సర్కార్‌ తీరును, హింస, అవినీతిని నావల్నీ ధైర్యంగా ఎండగట్టారని బైడెన్ గుర్తు చేశారు.

బైడెన్ అలా ప్రకటించిన కొన్నేళ్లకే!
నావల్నీ మృతి నేపథ్యంలో రష్యా దమనకాండను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక సాయం చేసేందుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపాలని బైడెన్ కోరారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని వైట్‌హౌస్‌ ప్రతినిధులు తెలిపారు. అయితే నావల్నీ మరణం పుతిన్‌కు వినాశనకరమైన పరిణామాలను కలిగిస్తుందని కొన్నేళ్ల క్రితమే అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. 2021లో జెనీవాలో జరిగిన బైడెన్‌-పుతిన్‌ భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పుతిన్‌ అంటే ఏమిటో ప్రపంచానికి!
పుతిన్ ప్రత్యర్థి నావల్నీ మృతిని తీవ్ర విషాదకర ఘటనగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నారు. రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వారిని అణచివేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ఈ ఘటన తెలియజేస్తోందని ఆరోపించారు పుతిన్‌ అంటే ఏమిటో ప్రపంచానికి ఇది గుర్తుచేస్తుందని ట్రూడో విమర్శించారు

పుతిన్ చేసిన హత్యనే!
ఇది పుతిన్ చేసిన హత్యేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ విమర్శించారు. ఎవరు చనిపోయినా పుతిన్​కు పట్టింపు ఉండదని, తన పదవిని కాపాడుకోవడం మాత్రమే ఆయన లక్ష్యమని ధ్వజమెత్తారు. 'పుతిన్ అన్నీ కోల్పోవాల్సిందే. ఆయన చేసిన పనులన్నింటికీ బాధ్యుడిని చేయాల్సిందే' అని పేర్కొన్నారు.

ప్రజల నివాళులు
నవాల్నీని పుతినే హత్యచేశారని లాత్వియా అధ్యక్షుడు ఎడ్గార్స్ రింకెవిక్స్ ఆరోపించారు. నవాల్నీ ఎంతో ధైర్యవంతుడని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌ కొనియాడారు. కాగా, అనేక ఐరోపా దేశాల్లో రష్యాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. నవాల్నీకి ప్రజలు నివాళులు అర్పించారు.

నావల్నీకి ప్రజల నివాళులు
నావల్నీకి ప్రజల నివాళులు
నావల్నీకి ప్రజల నివాళులు
నావల్నీకి ప్రజల నివాళులు

'పుతిన్‌ శిక్ష నుంచి తప్పించుకోలేరు'
నావల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యులియా నావల్నయా అనుమానం వ్యక్తం చేశారు. అవే నిజమైతే పుతిన్‌ శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. "పుతిన్​తోపాటు అతడి ప్రభుత్వాన్ని నమ్మలేం. వారు ఎప్పుడూ అవాస్తవాలే చెప్తారు. కానీ వారు చెప్పింది నిజమైతే నా దేశానికి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి పుతిన్‌ బాధ్యత వహించాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది" అని ఆమె తెలిపారు. ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న రష్యన్ పీనల్‌ కాలనీలో నావల్నీ మృతి చెందారు. రెండు నెలల క్రితమే జైలు అధికారులు ఆయనను అక్కడకు తరలించడం గమనార్హం.

'రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఆయనే గెలివాలి'- బైడెన్​పై పుతిన్​ ప్రశంసలు

'యుద్ధంలో వెనక్కి తగ్గితే పుతిన్​ను చంపేస్తారు'- రష్యాకు మద్దతుగా మస్క్ వ్యాఖ్యలు

Last Updated : Feb 17, 2024, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details