US Election 2024 Kamala Harris :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడం వల్ల ఆ స్థానంలో కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైనట్లే. ఇప్పటికే మెజారిటీ ప్రతినిధులు ఆమెకు మద్దతు పలకగా, తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతుల నుంచి మద్దతు వ్యక్తమైంది. దీంతో కమల అభ్యర్థిత్వంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నట్లు చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
'అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం'
"నేను, మిషెల్ మా స్నేహితురాలు కమలా హారిస్‌కు కొద్ది రోజుల క్రితం ఫోన్ చేశాం. ఆమె యునైటెడ్ స్టేట్స్‌కు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం. ఆమెకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు తెలియజేశాం. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో కమల గెలవడానికి ఏమైనా చేస్తాం. మీరు కూడా మాతో చేరుతారని ఆశిస్తున్నాం" అంటూ కమల హారిస్‌తో ఫోన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు బరాక్ ఒబామా.
'ఇది నాకు ఎంతో విలువైంది'
"మీకు మద్దతు ఇచ్చే విషయంలో మిషెల్, నేను ఎంతో గర్వపడుతున్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని ఓవల్ ఆఫీస్‌కు పంపే విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తాం" అని కమలతో ఒబామా ఫోన్ కాల్‌లో మాట్లాడారు. "మీ విషయంలో గర్వంగా ఉంది. ఇది చారిత్రకం కానుంది" అని మిషెల్ అన్నారు. వారికి వెంటనే కమలా హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. "ఇది నాకు ఎంతో విలువైంది" అని బదులిచ్చారు.
ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో కూడా!
బైడెన్ వైదొలగడం వల్ల ఆయన స్థానంలోకి వచ్చిన కమలా హారిస్‌కు డెమొక్రటిక్ పార్టీ సభ్యుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. దాంతో ఆయన మద్దతు ఆమె ఫండ్ రైజింగ్(అధ్యక్ష ఎన్నికల ఖర్చు కోసం విరాళాల సేకరణ) కార్యక్రమాలకు సహాయపడనుంది. అలాగే అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన తర్వాత ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందు బైడెన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో కూడా ఒబామా పాల్గొన్నారు.