BAPS Hindu Mandir Abu Dhabi : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా 55 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (బాప్స్) సంస్థ నిర్మించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 14న జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బాప్స్ స్వామినారాయణ్ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచ దేశాలు, మతాలు, సమాజాల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిర్మించిన ఈ దేవాలయం గురించి ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం.
భారత శిల్పకళ ఉట్టిపడేలా నిర్మాణం
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదబీలోని అబూ మురీఖా ప్రాంతంలో దాదాపు 108 అడుగుల ఎత్తుతో 27 ఎకరాల స్థలంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఇందులో ప్రధాన ఆలయంతో పాటు సందర్శకుల కేంద్రం, ప్రార్థన మందిరాలు, ప్రదర్శన కేంద్రాలు, పిల్లలు యువత కోసం క్రీడా ప్రాంతం, గార్డెన్లు, ఫుడ్ కోర్ట్, బుక్స్ గిఫ్ట్స్ షాప్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
25వేల టన్నుల రాయి ఉపయోగం
భారతీయ ప్రాచీన ఆలయాల నిర్మాణ పద్ధతిలోనే ఈ బాప్స్ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలోని ఏడు శిఖరాలు ఏడు అరబ్ ఎమిరేట్లను సూచిస్తాయి. మందిర రూపకల్పనలో ఎలాంటి ఇమును గానీ ఆ తరహాలోని మరో పదార్థం గానీ వాడలేదు. హిందూ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తి సహజంగా నిర్మితమైన ఈ మందిరం వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుంది. దీని నిర్మాణానికి 7 వందలకుపైగా కంటైనర్లలో దాదాపు 25 వేల టన్నుల రాతిని అబుదబీకి రవాణా చేశారు. ఆలయ పునాదిలో ఫ్లైయాష్ను ఉపయోగించారు. ఆలయాన్ని పర్యవేక్షించడానికి, భూకంపం వంటి సంఘటనలు సంభవించినప్పుడు డేటాను, ఒత్తిడి, పీడనం వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి వివిధ స్థాయుల్లో 300కు పైగా సెన్సార్లను అమర్చారు.
హిందూ శాస్త్రాల ప్రకారం
ప్రాచీన హిందూ శిల్పశాస్త్రాల ప్రకారం ఈ స్వామినారాయణ్ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ గుడిలో 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై హిందూ దేవతామూర్తుల ప్రతిమలు, పలు సంగీత వాయిద్యాలు, వన్యప్రాణుల చిత్రాలున్నాయి. మందిరం వెలుపలి నిర్మాణంలో మొత్తం రాజస్థాన్ పింక్ సాండ్స్టోన్ను ఉపయోగించారు. ఆలయం లోపలి ప్రాంతాన్ని ఇటలీ నుంచి తెప్పించిన పాలరాతితో నిర్మించారు.