Bangladesh Constitutional Changes :రాజ్యాంగం నుంచి 'లౌకికవాదం', 'సోషలిజం'లను తొలగించాలని బంగ్లాదేశ్ రాజ్యాంగ సంస్కరణల కమిషన్ సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌కు ఓ నివేదికను సమర్పించింది. చివరికి రాజ్యాంగంలోని 'జాతీయవాదం'ను కూడా రీప్లేస్ చేయాలని ప్రతిపాదించింది.
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన సామూహిక ఆందోళన హింసాత్మకంగా మారిన తరువాత షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. దీనితో యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీనితో యూనస్ సర్కార్ రాజ్యాంగ సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దేశంలో ద్విసభ పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రధాని పదవికి టూ-టెర్మ్ లిమిట్ మాత్రమే ఉండాలని ప్రతిపాదించింది. అంటే బంగ్లాదేశ్ ప్రధాని పదవిని ఎవరైనా కేవలం రెండు సార్లు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉండాలని సూచించింది.
బంగ్లాదేశ్ రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సోషలిజం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం అనే 4 ప్రాథమిక భావనలు ఉన్నాయి. వీటిలో మొదటి మూడింటిని తొలగించాలని కమిషన్ సూచించింది. కేవలం 'ప్రజాస్వామ్యం' అనే పదం మాత్రమే రాజ్యాంగ ప్రవేశికలో ఉంచాలని పేర్కొంది.
"1971 విముక్తి యుద్ధం ఆదర్శాలను, అలాగే 2024 సామూహిక తిరుగుబాటుకు కారణమైన ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా మేము 5 కొత్త సూత్రాలను ప్రతిపాదిస్తున్నాం. అవి: సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయం, బహుళత్వం (ప్లూరలిజం), ప్రజాస్వామ్యం" అని రాజ్యాంగ సంస్కరణల కమిషన్ ఛైర్మన్ అలీ రియాజ్ తెలిపారు.
ద్విసభా విధానం
బంగ్లాదేశ్‌లో రెండు సభలతో పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగ సంస్కరణల కమిషన్ సూచించింది. 105 సీట్లతో నేషనల్ అసెంబ్లీ (దిగువ సభ), 405 సీట్లతో సెనేట్ (ఎగువ సభ)ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతమున్న ఐదేళ్ల కాలపరిమితి కాకుండా, ఇకపై పార్లమెంట్ పదవీకాలం 4 సంవత్సరాలకు కుదించాలని నివేదిక సూచించింది.
దిగువ సభ మెజారిటీ ప్రాతినిథ్యంపై, ఎగువ సభ దామాషా ప్రాతిపదికపై ఏర్పాటు కావాలని కమిషన్ ప్రతిపాదించింది. అలాగే ఇకపై ఎవరైనా రెండు సార్లకు మించి ప్రధాని పదవి చేపట్టకుండా పరిమితి విధించాలని సూచించింది. అలాగే జాతీయ రాజ్యాంగ మండలిని ఏర్పాటు చేయాలని, ఇందులో దేశాధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతలు (ఇద్దరూ పార్లమెంట్ ద్వారా ఎన్నికైనవారు), ఉభయ సభలు స్పీకర్లు, ప్రతిపక్షం నుంచి డిప్యూటీ స్పీకర్లు, ఇతర పార్టీల ప్రతినిధులు ఉండాలని సూచించింది. ఈ రాజ్యాంగ సంస్థ పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేస్తుందని కమిషన్ పేర్కొంది.
ప్రజాభిప్రాయ సేకరణ
బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రజాభిప్రాయ సేకరణ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలని కమిషన్ ప్రతిపాదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పార్లమెంట్ మూడింట రెండు వంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు. పాకిస్థాన్ నుంచి విముక్తి పొంది స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భవించిన ఒక సంవత్సరం తరువాత, 1971లో బంగ్లాదేశ్ రాజ్యాంగం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 17 సార్లు దానిని సవరించారు.
త్వరలోనే ఎన్నికలు
ప్రాథమిక సంస్కరణలు చేసిన తరువాత ఈ సంవత్సరాంతానికి లేదా 2026 మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని యూనస్ భావించారు. అయితే దీనిని వ్యతిరేకించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఏడాది జులై-ఆగస్టుల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.