Azerbaijan Flight Crash : కజకిస్థాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారని, మిగిలిన 29 మంది సురక్షితంగా బయటపడ్డారని కజకిస్థాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది సహా, 67 మంది ప్రయాణికులు ఉన్నారని కజకిస్థాన్ అత్యవసర మంత్రిత్వశాఖ తెలిపింది.
అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల విమానం రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో మంటలు చెలరేగినట్లు తెలిపాయి.
పక్షి ఢీకొట్టడమే కారణమా?
తొలుత ఈ విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్ల పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్‌కు ప్రయత్నించినట్లు రష్యా ఏవియేషన్ వాచ్‌డాగ్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. అయితే విమానంలోని కీలకమైన కంట్రోల్స్, బ్యాకప్ సిస్టమ్స్ విఫలమైనట్లు గుర్తించి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
నిపుణులు ఏమంటున్నారు?
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ జే2-8243లో కీలకమైన వ్యవస్థలు విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ విమానం బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్‌లోని అక్టౌలో కూలిపోయిన విషయం తెలిసిందే. ఇది వేగంగా కిందికి దూసుకొచ్చి నేలను ఢీకొని ముక్కలుగా విరిగిపోయింది. కొన్ని భాగాలు పూర్తిగా దగ్ధమైనట్లు ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో స్పష్టంగా ఉంది.