AstraZeneca Withdraws COVID Vaccine : ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తాము అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంది. ఈ టీకా తీసుకున్న వారిలో అరుదుగా దుష్ప్రభావాలవను కలిగిస్తుందని ఇటీవలే యూకే కోర్టుకు ఆస్ట్రాజెనికా తెలిపింది. కానీ ఇప్పుడు వాణిజ్య కారణాల వల్ల ఈ టీకాను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రకటించింది.
కొత్త వేరియంట్లతో పోరాడే అనేక వ్యాక్సిన్లు మార్కెట్లో లభిస్తున్నందున తమ టీకాకు గిరాకీ తగ్గిందని ఆస్ట్రాజెనికా తెలిపింది. ఈ నేపథ్యంలో తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇకపై తయారీ చేయమని, సరఫరా కూడా చేయమని వెల్లడించింది. యూరోపియన్ యూనియన్‌లో టీకా ఉపసంహరణకు మార్చి 5న దరఖాస్తు చేయగా అది మే 7న అమల్లోకి వచ్చింది. "వాక్స్‌జెవ్రియా" పేరుతో తయారు చేసిన టీకాను కొద్దినెలల్లో యూకే, ఇతర దేశాలలోనూ ఉపసంహరించేందుకు దరఖాస్తులు సమర్పిస్తామని ఆ సంస్థ తెలిపింది.
యూకే హైకోర్టులో కేసు
ఇటీవల వాక్స్‌జెవ్రియా టీకా వల్ల కొందరిలో రక్తం గడ్డకట్టడం, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుందని తేలింది. ఇది చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతుందని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ టీకా కారణంగా యూకేలో కనీసం 81 మంది మృతి చెందగా వందలాది మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తేలింది. 50 మందికిపైగా బాధితులు, వారి బంధువులు యూకే హైకోర్టులో ఆస్ట్రాజెనెకాపై కేసు వేశారు. అయితే ఆ కేసుకు ఇప్పుడు మార్కెట్ల నుంచి టీకా సరఫరాకు ఎలాంటి సంబంధంలేదని ఆస్ట్రాజెనికా తెలిపింది. ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో కోట్ల మందికి కరోనా సమయంలో ఇచ్చారు. కరోనా సమయంలో తమ టీకా కోట్ల మంది ప్రాణాలు కాపాడటంలో ఉపకరించిందని ఆస్ట్రాజెనికా చెప్పుకొచ్చింది.