America 9/11 Attacks : అమెరికాలో 2001 సెప్టెంబరు 11న జంట భవనాలపై దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక ఉగ్రవాది ఖలీద్ షేక్ మహ్మద్ తన నేరాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఖలీద్ షేక్ మహ్మద్ మరో ఇద్దరు సహచరులు వాలిద్ బిన్ అట్టాశ్, ముస్తఫా అల్-హవ్సావి కూడా నేరాంగీకారానికి ముందుకు వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం వీరంతా క్యూబాలోని గ్వాంటనామో అమెరికా సైనిక జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
జీవిత ఖైదు పడే అవకాశం
ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను మాత్రం పెంటగాన్ వెల్లడించలేదు. అయితే, నిందితులు సుదీర్ఘకాలంగా మరణశిక్ష ముప్పును తప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దానికి సమ్మతిస్తేనే నేరాంగీకారానికి ముందుకు వస్తామని వారు షరతు విధించినట్లు సమాచారం. దీనికి అమెరికా అంగీకరించిన తర్వాతే తప్పును ఒప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వారికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు తెలిపారు.