తెలంగాణ

telangana

ETV Bharat / international

సిరియాలో రెచ్చిపోతున్న రెబల్స్‌- ఓడించి తీరుతామని అసద్‌ వార్నింగ్

సిరియాలో తీవ్రంగా మారుతున్న అంతర్యుద్ధం- అధిక భూభాగాన్ని అధీనంలోకి తీసుకున్న తిరుగుబాటుదారులు- రోడ్లు, వంతెనలపై పట్టు

Syria Crisis 2024
Syria Crisis 2024 (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 3:16 PM IST

Syria Crisis 2024 : సిరియా అతిపెద్ద నగరమైన అలెప్పోలో ఎక్కువ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న వేలాదిమంది తిరుగుబాటుదారులు, మరింత లోతుగా చొచ్చుకుపోతున్నారు. నగరంలోని అసద్‌ పోస్టర్లను చించిపారవేస్తున్నారు. అలెప్పో సరిహద్దు ప్రావిన్స్‌లపైనా రెబల్స్‌ దాడులకు సిద్ధమయ్యారు. అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ నేతృత్వంలోని సిరియన్‌ సైన్యం నుంచి హయత్‌ తహ్రీర్‌ అల్‌ షాం-HTS రెబల్స్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు. ఉత్తర హామా ప్రావిన్స్‌లోని పట్టణాలు, గ్రామాల్లో వేగంగా రెబల్స్‌ విస్తరిస్తున్నారు.

ఓడించి తీరుతామని అసద్‌ హెచ్చరిక
అసద్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే రష్యా, ఇరాన్‌, హెజ్బొల్లా ప్రస్తుతం సహకరించే పరిస్థితిలో లేనందున HTS రెబల్స్‌ బలంగా మారారు. దాడులు తీవ్రమైన వేళ ప్రభుత్వ సైనికులు అలెప్పో సిటీ నుంచి యుద్ధం చేయకుండానే చిత్తగిస్తున్నారు. అయితే అలెప్పోపై భారీ వైమానిక దాడులను మాత్రం ప్రారంభించారు. త్వరలోనే బలగాలను మోహరించి ఎదురుదాడులు చేస్తామని అసద్‌ సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్‌ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత, స్థిరత్వాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 300 మంది రెబల్స్‌, ప్రభుత్వ సైనికులు సహా 20 మంది పౌరులు చనిపోయారు.

సిరియా రెబల్స్ (Associated Press)

దూర ప్రాంతాలకు పౌరులు
అంతర్యుద్ధం ఇప్పుడప్పుడే సమసిపోయే అవకాశాలు కనిపించకపోవడం వల్ల అలెప్పో, ఇడ్లిప్‌ నగరాలు నుంచి పౌరులు దూర ప్రాంతాలకు, సమీప శరణార్థి శిబిరాలకు చేరుకుంటున్నారు. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధవిమానాల నుంచి ఎప్పుడు బాంబులు పడ్తాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపుగా 10వేల కుటుంబాలు ఆయా నగరాల నుంచి పారిపోయాయి. గత ఆరేళ్లలో సిరియాలో ఇదే అతిపెద్ద పౌర వలసలుగా అధికారులు చెబుతున్నారు.

సిరియా రెబల్స్ (Associated Press)

2011లో అధ్యక్షుడు బషర్‌ అల్‌- అసద్‌కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ ఉద్యమాన్ని అసద్‌ అణచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వదళాలు తిరుగుబాటుదారుల మధ్య జరిగిన పోరులో 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. 23 లక్షల జనాభా ఉన్న అలెప్పో 2012లో రెబల్స్‌ వశమైంది. కానీ 2016లో రష్యా, ఇరాన్‌ అండతో సిరియాపై అసద్‌ పట్టుసాధించారు. తర్వాత అంతర్యుద్ధ తీవ్రత తగ్గింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇరాన్‌, హెజ్బొల్లా ఇజ్రాయెల్‌ వ్యవహారంలో చిక్కుకుపోయాయి. ఇదే సరైన సమయమని భావించిన తుర్కియే మద్దతున్న ఫైటర్లు సహా HTS రెబల్స్‌ మళ్లీ అలెప్పోపై దాడులు చేసి అధీనంలోకి తెచ్చుకున్నారు. అసద్‌ నేతృత్వంలోని బలగాలు బలహీనపడుతూ పోతే రాజధాని డమాస్కస్‌ దిశగా తిరుగుబాటుదారులు కదులుతారని సమాచారం.

సిరియా రెబల్స్ (Associated Press)
రెబల్స్ పెట్టిన నిప్పు (Associated Press)

ట్రంప్ 2.Oలో మరో భారతీయుడు - FBI డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌

బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్‌ సభ్యుడి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details