AR Rahman Video To Support Harris :డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రంగంలోకి దిగారు. హారిస్‌కు మద్దతుగా 30 నిమిషాల ప్రదర్శన వీడియోను ఆయన రికార్డ్ చేశారు. దీంతో హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా రెహమాన్ నిలిచారు. రెహమాన్ రికార్డు చేసిన ఈ వీడియో కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు.
'రెహమాన్ స్వరం కలిపినట్లైంది'
అమెరికా పురోగతి కోసం ఇప్పటికే నిలబడ్డ నాయకులు, కళాకారుల బృందానికి ఈ ప్రదర్శన ద్వారా ఏఆర్ రెహమాన్ తన స్వరాన్ని కలిపినట్లు అయిందని ఆసియా అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) విక్టరీ ఫండ్ ఛైర్మన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. ఏఆర్ రెహమాన్ ప్రదర్శన సంగీత కార్యక్రమం మాత్రమే కాదని, ఆసియా ప్రజలు చూడాలనుకుంటున్న అమెరికా కోసం కమ్యూనిటీ ఓటు వేయాలనే పిలుపని పేర్కొన్నారు.
అక్టోబరు 13న రిలీజ్
అమెరికాలోని దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏఏపీఐ విక్టరీ ఫండ్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కమలకు మద్దతుగా రెహమాన్ రూపొందించిన వీడియోను ఏఏపీఐ విక్టరీ ఫండ్ యూట్యూట్ ఛానల్లో అక్టోబరు 13న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనుంది. అలాగే ఏవీస్ లేదా టీవీ ఆసియా సహా దక్షిణాసియా నెట్‌వర్క్‌లలో ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ వీడియోలో ఏఆర్ రెహమాన్ హిట్ సాంగ్స్‌తో పాటు, కమల హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన వారి సందేశాలు ఉంటాయి.